మళ్లీ హైదరాబాద్‌కు కొత్తగూడెం డీఎస్పీ

11 Apr, 2020 11:41 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం రూరల్‌: కరోనా పాజిటివ్‌ వచ్చిన కొత్తగూడెం డీఎస్పీకి నెగిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో గురువారం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ చెస్ట్‌ హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ చేసిన విషయం విదితమే. దీంతో ఆయన కొత్తగూడెం చేరుకున్నారు. కాగా, ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎర్రర్‌ రావడంతో తిరిగి శుక్రవారం ఉదయం మరోసారి హైదరాబాద్‌కు తరలించారు. డీఎస్పీ కుమారుడు విదేశాల నుంచి తిరిగి రాగా, అతడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.హైదరాబాద్‌ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో వైద్యం అందించారు. ఇటీవలే డీఎస్పీ కుమారుడు ఆర్బాజ్‌కు కరోనా నెగిటివ్‌ రావడంతో డిశ్చార్జ్‌ చేసి హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఇక డీఎస్పీకి కూడా కరోనా నెగిటివ్‌ రావడంతో గురువారం డిశ్చార్జ్‌ చేయగా కొత్తగూడెం  చేరుకున్నారు.

కాగా, ఆయనకు హైదరాబాద్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో రెండు రిపోర్ట్‌లలో నెగిటివ్‌ రావడం, మరో రిపోర్ట్‌ ఫలితం పూర్తిగా రాక ముందే డిశ్చార్జ్‌ చేసినట్లు తెలుస్తోంది. తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో శుక్రవారం ఉదయం ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ భద్రాద్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి భాస్కర్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించారు. దీంతో డీఎస్పీని సింగరేణి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌ ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో అతడి పేరుతో ఇద్దరు ఉండగా, ఒకరికి బదులు డీఎస్పీని డిశ్చార్జ్‌ చేశారంటూ సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విషయమై డీఎంహెచ్‌ఓ భాస్కర్, డీఎస్‌ఓ చైతన్యను ‘సాక్షి’ సంప్రదించగా, అటువంటిదేమీ లేదని, అవన్నీ తప్పుడు ప్రచారాలంటూ కొట్టిపారేశారు. శనివారం ఉదయం మరోసారి డీఎస్పీకి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

మరిన్ని వార్తలు