ఏడో దశ కేటీపీ‘ఎస్‌’!

1 Feb, 2018 03:34 IST|Sakshi

కొత్తగూడెం విద్యుత్‌ కేంద్రం ట్రయల్‌ రన్‌ విజయవంతం 

బాయిలర్‌ను వెలిగించిన జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు 

మార్చి 31 నాటికల్లా 800 ఎంవీ ఉత్పత్తి ప్రారంభం! 

తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రారంభించి, పూర్తి చేసిన తొలి ప్లాంట్‌ 

హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న కొత్తగూడెం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (కేటీపీఎస్‌) ఏడో దశ ప్లాంట్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. విద్యుత్‌ ఉత్పత్తికి అత్యంత కీలకమైన బాయిలర్‌ను తెలంగాణ జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు బుధవారం ఉదయం 8.46 గంటలకు వెలిగించారు. ఉత్తరాంచల్‌ రాష్ట్రం హరిద్వార్‌లో బీహెచ్‌ఈఎల్‌ తయారు చేసిన భారీ జనరేటర్‌తో బాయిలర్‌ను అనుసంధానం చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రారంభించి, పూర్తి చేసిన తొలి విద్యుత్‌ ప్లాంట్‌గా కేటీపీఎస్‌ ఏడో దశ ప్రాజెక్టు నిలవనుంది. రూ.5,700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు నిర్మాణ పనులను 2015 జనవరి 1న ప్రారంభించారు.

దేశంలో కొత్త విద్యుత్‌ కేంద్రం నిర్మాణం ప్రారంభించిన 48 నెలల్లో పూర్తి చేయాలని కేంద్రీయ విద్యుత్‌ మండలి (సీఈఏ) నిబంధనలున్నాయి. అయితే కొత్తగూడెం ప్లాంటు నిర్మాణం అంతకన్నా తక్కువ వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేసుకుని కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. దేశంలో మరెక్కడా ఇంత తక్కువ సమయంలో విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంటు నిర్మాణం జరగలేదు. కేటీపీఎస్‌ ఏడో దశ ఉత్పత్రి ప్రారంభించిన తర్వాత తెలంగాణకు అందుబాటులో ఉండే విద్యుత్‌ 15 వేల మెగావాట్లు దాటుతుంది. కార్యక్రమంలో జెన్‌కో డైరెక్టర్లు రాధాకృష్ణ, సచ్చిదానందం తదితరులు పాల్గొన్నారు. 

17 వేల మెగావాట్లు: ప్రభాకర్‌ రావు 
28 వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులో ఉండేలా ప్రణాళిక రచించి, తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్దేశించిన లక్ష్యం మేరకు విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుతున్నట్లు జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు వెల్లడించారు. కేటీపీఎస్‌ ఏడో దశ, భద్రాద్రి ప్లాంట్లను సందర్శించి.. పనుల పురోగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్‌ చివరి నాటికి రాష్ట్రానికి 17 వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి 6,573 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే అందుబాటులో ఉండేదని, ఇప్పుడు దాన్ని 14,972 మెగావాట్లకు చేర్చగలిగామని, ఇందులో 3 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కూడా ఉందన్నారు. మార్చి 31 నాటికి కేటీపీఎస్‌ నుంచి 800 మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. డిసెంబర్‌ 31 నాటికి 1,080 మెగావాట్ల సామర్థ్యం ఉన్న భద్రాద్రి ప్లాంటు నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పారు. డిసెంబర్‌ నాటికి మరింత సోలార్‌ విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 

హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌ 
కేటీపీఎస్‌ ఏడో దశ నిర్మాణం లో భాగంగా బాయిలర్‌ను వెలిగించి, ట్రయల్‌ రన్‌ ప్రారంభించడంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రభాకర్‌రావుకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు.  
 

మరిన్ని వార్తలు