కొత్తపేట టు కోహెడ’ ఎప్పుడో?

11 Feb, 2020 08:42 IST|Sakshi

పండ్ల మార్కెట్‌ను త్వరగా తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు  

ఐదేళ్లుగా అలసత్వం..ఇప్పుడు అధికారుల్లో హడావుడి

మామిడి సీజన్‌కు ముందే తరలింపు కష్టమే!

ఇంకా పూర్తికాని మార్కెట్‌ షెడ్ల నిర్మాణాలు  

తరలింపుపై స్పష్టత లేక వ్యాపారుల్లో ఆందోళన

సాక్షి, సిటీబ్యూరో: కొత్తపేట పండ్ల మార్కెట్‌ కోహెడకు తరలించే పనుల్లో జాప్యం నెలకొంటోంది. దీంతోఈ ఏడాది మామిడి సీజన్‌కు ముందే మార్కెట్‌నుతరలించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా లేదు. 2015లోనే ఈ మార్కెట్‌ తరలించాలని నిర్ణయించినప్పటికీ అనివార్యకారణాల వల్ల వాయిదాపడుతూవచ్చింది. తాజాగా మార్కెట్‌ను యుద్ధప్రాతిపదికన తరలించాలని ప్రభుత్వం ఆదేశించడంతో మార్కెటింగ్‌ అధికారుల్లో అలజడిమొదలైంది. అయితే, ఈ మామిడి సీజన్‌కు ముందే మార్కెట్‌ను తరలించాలనుకున్నా కోహెడలో పూర్తిస్థాయిలో పనులు పూర్తికాకపోవడంతో మరోమూడు నెలలు పట్టేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్తపేట నుంచి కోహెడకు పండ్ల మార్కెట్‌ను తరలించడం ద్వారా నగరంపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గడంతో పాటు విజయవాడ మార్గంలో వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొహెడలో 178.09 ఎకరాల్లో భూమి చదును చేశామని అంటున్నారు. అయితే మార్కెట్‌ షెడ్లు నిర్మాణాలు ఇంకా ప్రారంభించలేదు. వాహనాల పార్కింగ్‌ కోసం అంతర్గత రోడ్లు, పార్కింగ్‌ యార్డుల కోసం స్థలాలు కూడా కేటాయించాల్సి ఉంది. వీటిన్నిటిని గమనిస్తే మార్కెట్‌ తరలింపులో ఆలస్యం తప్పదనిపిస్తోంది.  

ఐదేళ్ల నుంచే డిమాండ్‌..
మామిడి సీజన్‌లో విజయవాడ రూట్‌లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో కొత్తపేట్‌లోని ఫ్రూట్‌ మార్కెట్‌ను అదే దారిలోని నగర శివారు ప్రాంతానికి తరలించాలని 2015లోనే ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం విజయవాడ హైవే రూట్‌లో కొత్తపేట్‌ మార్కెట్‌ నుంచి 23 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోహెడ గ్రామంలో 178.09 ఎకరాల భూమిని కేటాయించారు. 2018 నుంచి మార్కెట్‌ తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు.  2019లో 178.09 ఎకరాల భూమిని చదును చేశారు. దీంతో పాటు మార్కెట్‌ స్థలంలో బోర్లు వేశామని మార్కెట్‌ అధికారులు చెప్పారు. గతంలో నగరంలో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవడంతో 1986లో మొజంజాహీ మార్కెట్‌లో కొనసాగుతున్న ఫ్రూట్‌ మార్కెట్‌ను కొత్తపేటకి మార్చారు. ఇప్పుడు కొత్తపేట ప్రూట్‌ మార్కెట్‌ వద్ద కూడా మొజంజాహీలో ఉన్నప్పటి పరిస్థితులు ఎదురవడంతో కోహెడకు మార్చాలని ప్రభుత్వంనిర్ణయించింది. 

స్పీడ్‌ పెంచాల్సిందే...
గత ఐదేళ్లుగా ప్రతి ఏటా మామిడి సీజన్‌లో (అంటే మార్చి నుంచి జూన్‌) విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. తెలంగాణ జిల్లాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి మామిడి ఎగుమతి, దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. దీంతో కిలో మీటర్ల పొడవునా ట్రాఫిక్‌ జామ్‌ ఉంటుంది. వీటిని దృష్టిలోపెట్టుకుని ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనైనా మార్కెట్‌ను కోహెడకు తరలించాలని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. కానీ మామిడి సీజన్‌కు 20 రోజులే సమయం ఉన్నా..పనులు పూర్తి కాలేదు. పనుల స్పీడ్‌ పెరిగితే ఏదైనా ఛాన్స్‌ ఉంటుంది. ప్రసుత్తం మార్కెట్‌లో 340 మంది లైసెన్స్‌డ్‌ కమిషన్‌ ఏజెంట్లు ఉన్నారు. వీరికి కోహెడలో షెడ్లు నిర్మించి షాపులు కేటాయించాల్సి ఉంది. ఈ దిశలో ఇంకా వేగం పెరగాలి. దీనిపై వ్యాపారులు కూడా ఆందోళనగా ఉన్నారు. పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించకుండా మార్కెట్‌ను ఎలా తరలిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కోహెడలో నిర్మాణాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే మూడు నెలల్లో పూర్తవుతుందని, అయినా ఆ దిశగా వారు పట్టించుకోవడం లేదని కొందరు వ్యాపారులు చెబుతుండడం కొసమెరుపు. 

మరిన్ని వార్తలు