మనం మారకుంటే భారీ నష్టమే..

23 Apr, 2020 08:14 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కొవిడ్‌ వైరస్‌ విజృంభిస్తున్నా నగరవాసులు కొందరు సీరియస్‌గా తీసుకోకపోవడాన్ని కొత్వాల్‌ అంజనీకుమార్‌ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనా బారినపడి చిగురుటాకులా వణికిపోతోందని, అది మనందరికీ ఓ పాఠం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి అంజనీకుమార్‌ బుధవారం ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. అందులోని అంశాలు ఆయన మాటల్లోనే.. నగర వాసులారా.. ప్రపంచంలో అత్యంత ధనిక, శక్తిమంతమైన దేశం అమెరికా సైతం కొవిడ్‌తో యుద్ధం చేస్తోంది.

అందులో ఆ దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కరోనా వైరస్‌ వల్ల అమెరికాలో చోటు చేసుకున్న మరణాల సంఖ్య వియత్నాం యుద్ధంలో నమోదైన వాటి కంటే ఎక్కువే.. మన దేశంలో గడిచిన మూడు రోజుల్లో అత్యధిక కేసులు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌ నగర వాసులు కంటైన్మ్‌ంట్‌ ఏరియాను పూర్తిస్థాయిలో సీల్‌ వేసినట్లు భావించాలి. లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలి. ఇప్పటికే నగరంలో ప్రతిరోజూ ఆరు నుంచి ఏడు వందల వాహనాలు సీజ్‌ చేస్తున్నాం. లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో అమలు కావట్లేదని చెప్పడానికి ఇదే నిదర్శనం. అనేక మంది నగరవాసులు ప్రస్తుత పరిస్థితుల్ని అర్థం చేసుకోవట్లేదనే భావన కలుగుతోంది. అంతా కలిసి కరోనాతో యుద్ధం చేద్దాం.. మీరు ఇంట్లో ఉండి, మేము, డాక్టర్లు బయట ఉండి వైరస్‌పై విజయం సాధిద్దాం. ప్రతి ఒక్కరూ ఇప్పడున్న పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇంట్లో నుంచి ఏ ఒక్కరినీ బయటకు రానీయవద్దని కోరుతున్నా.  

మరిన్ని వార్తలు