పట్టాలియ్యకుంటే ఓట్లేయం!

24 Sep, 2018 01:36 IST|Sakshi

గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొత్తపేట రైతుల ప్రతిజ్ఞ

జగదేవ్‌పూర్‌ (గజ్వేల్‌): గ్రామంలో తమ భూముల సమస్యను పరిష్కరించి పట్టా, పాస్‌ పుస్తకాలు ఇవ్వకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని కొత్తపేట రైతులు ప్రతి జ్ఞ చేశారు. ఏళ్ల నుంచి ఉన్న ఈ సమస్య భూ రికార్డు ల ప్రక్షాళనలోనూ పరిష్కారం కాకపోవడంతో రైతుబంధు, బీమా పథకాలు అమలవడం లేదని, అందు కే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. దశాబ్దాల నుంచి భూ సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ వ్యవసా య క్షేత్రానికి కూతవేటు దూరంలో ఉన్న తమ భూ సమస్యలను అధికారులు పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే నాయకులను తమ గ్రామంలోకి రానివ్వబోమని తెలిపారు.  

ఇదీ సమస్య...
పూర్వం గ్రామంలో పన్నిలాల్‌ అనే వ్యక్తికి అప్పటి జాగీదార్లు సుమారు 735 ఎకరాల భూమి ఇచ్చారు. కొన్నేళ్ల పాటు అతనే ఆ భూమి సాగు చేసుకుంటూ వచ్చాడు. అనంతరం గ్రామానికి చెందిన రైతులకు కౌలుకు ఇచ్చారు. దశాబ్దాల పాటు వారే సాగు చేసుకుంటూ కాస్తులో ఉన్నారు. రక్షిత కౌలుదారు చట్టం ప్రకారం తమ పేర్ల మీద భూమిని ఇనాంగా ఇచ్చినట్లు రైతులు తెలిపారు. 1978లో సీలింగ్‌ చట్టం కింద భూములను ప్రభుత్వానికి అప్పగించినట్లు పేర్కొ న్నారు.

1994లో అప్పటి ప్రభుత్వం (ఓఆర్‌సీ)ను అమలు చేస్తూ ఇనాం పట్టా కింద రైతులకు పట్టాలు అందించినట్లు చెప్పారు. 2006లో అప్పటి ప్రభుత్వం గ్రామంలో భూములను సర్వే చేయించి పట్టాలు ఉన్న భూములను ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో నమోదు చేయించిందని వాపోయారు. అప్పటి నుంచి సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయిందన్నారు. విషయాన్ని పలుమార్లు కలెక్టర్లు, అధికారుల దృష్టికి తీసుకుపోయామని, ఇటీవల మంత్రి హరీశ్‌రావుకు చెప్పినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు భూ రికార్డుల్లో సమస్యలు ఉండటంతో వారు రైతుబంధు పథకానికి నోచుకోవడం లేదు. ఇటీవల భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరం కాలేదని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు