3 జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలు

25 Apr, 2016 19:25 IST|Sakshi

- మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం

 - ఒక్కో కేంద్రానికి రూ. 8 కోట్లు... త్వరలో పోస్టుల భర్తీ

- రాష్ట్రంలో పర్యటిస్తోన్న ఐకార్ ప్రతినిధి బృందం
 

హైదరాబాద్ : శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు, వాటిపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు మూడు జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) నిర్ణయించింది. ఒక్కో కేంద్రానికి ఐకార్ రూ. 8 కోట్ల వరకు మంజూరు చేసే అవకాశం ఉంది. నిధులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నిధులను ఐకార్ మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ కేంద్రాలు నడుస్తాయి.

ఆ మూడు జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై ఐకార్‌కు చెందిన ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఒక్కో జిల్లాలో రెండు మూడు ప్రాంతాలను వారు పరిశీలిస్తారు. తెలంగాణలోని వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలను ఎక్కడెక్కడ నెలకొల్పాలనే విషయంపై ఎవరికివారు ప్రాంతాలను ప్రతిపాదిస్తున్నారు. వారి ప్రతిపాదనలు వేర్వేరుగా పరిశీలించాక ఐకార్ ప్రతినిధి బృందం తుది నిర్ణయం తీసుకుంటుంది.

మంగళవారం ఐకార్ ప్రతినిధి బృందం అశ్వారావుపేటలోని ప్రస్తుతమున్న ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని పరిశీలిస్తుంది. ఆ క్యాంపస్‌లో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందా లేదా? అక్కడ కృషి విజ్ఞాన కేంద్రం అవసరమా లేదా ఐకార్ ప్రతినిధి బృందం నిర్ణయిస్తుంది. ఐకార్ ప్రతినిధి బృందంతోపాటు రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రతాప్ సహా ఇతర అధికారులు ఉంటారు. అనంతరం ఐకార్ ప్రతినిధి బృందం మెదక్ జిల్లా సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ప్రాంతాల్లోనూ పర్యటిస్తుందని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయ అధికారులు సాక్షి’కి తెలిపారు.

 

శాస్త్రవేత్తల పోస్టుల భర్తీ...

కృషి విజ్ఞాన కేంద్రాలను ఆ మూడు జిల్లాల్లో నెలకొల్పాక ఒక్కో కేంద్రంలో సుమారు ఆరుగురు చొప్పున శాస్త్రవేత్తల పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. వారితోపాటు ఇతర పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఐకార్ నుంచి ఆమోదం లభించాక రాష్ట్ర ప్రభుత్వం ఆయా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తుంది. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య రంగాల్లో వస్తోన్న అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు శిక్షణ ఇస్తారు. ఆ పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షించి రైతులకు అవగాహన కల్పిస్తారు.
 

మరిన్ని వార్తలు