రాష్ట్రానికి 52.50 టీఎంసీలు కేటాయించిన కృష్ణాబోర్డు

7 Sep, 2018 02:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలంలో లభ్యతగా ఉన్న జలాల్లో తెలంగాణకు 52.50 టీఎంసీలను కేటాయిస్తూ కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం గురువారం ఆదేశాలిచ్చారు. ఇందులో 33 టీఎంసీల నీటిని సాగర్‌ఎడమ కాల్వ కింది అవసరాలకు, మరో 12 టీఎంసీల నీటిని ఎంఆర్‌పీ కింద తాగు, సాగు అవసరాలకు, మరో 7.50 టీఎంసీలు హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు కేటాయించారు.

ప్రస్తుతం సాగర్‌లో కనీస నీటి మట్టాలకు ఎగువన 172 టీఎంసీలు, శ్రీశైలంలో 148.65 టీఎంసీలు కలిపి మొత్తంగా 320 టీఎంసీల మేర నీటినిల్వలు లభ్యతగా ఉన్న దృష్ట్యా అందులోంచే ఈ నీటిని కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి డేటాను తెలంగాణ, ఏపీలు ఆమోదించి బోర్డుకు పంపాలని తెలిపింది. 2015లో నిర్వహించిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన అవగాహన మేరకు ఈ నీటి విడుదలలో బోర్డు ఆదేశాలు పాటించాలని సూచించింది.  

స్థిరంగా ప్రవాహాలు..
ఇక సాగర్‌లోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. గురువారం సాగర్‌లోకి 26వేల క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో ప్రాజెక్టులో ప్రస్తుతం 312 టీఎంసీలకు గానూ 303.95 టీఎంసీల నిల్వలున్నాయి. ఇందులోంచే 19,213 క్యూసెక్కుల నీటిని దిగువ అవసరాలకు విడుదల చేస్తున్నారు. ఇక ఎగువన శ్రీశైలానికి స్థిరంగా 25వేల క్యూసెక్కులు వస్తుండగా ప్రాజెక్టు నుంచి 54వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

మరిన్ని వార్తలు