తెలుగు రాష్ట్రాలపై కృష్ణా బోర్డు అసహనం 

2 Mar, 2019 04:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నీటి వినియోగానికి సంబంధించి తమ ఆదేశాలను బేఖా తరు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కృష్ణా బోర్డు అసహనాన్ని వ్యక్తం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లే విషయంలో తమతో చర్చించాలని, త్రిసభ్య కమిటీ ఆమోదం తర్వాతే నీటిని తీసుకోవాలని సూచించినప్పటికీ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది.

ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు బోర్డు శుక్రవారం లేఖలు రాసింది. మే వరకు ఇరు రాష్ట్రాల నీటి అవసరాలను అందజేయాలని కోరినా ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. నాగార్జునసాగర్‌లో 590 అడుగులకు గానూ 527.50 అడుగుల్లో 131.66 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఇందులో 510 అడుగుల కనీస నీటి మట్టానికి ఎగువన 31.64 టీఎంసీలు ఉందని తెలిపింది. ఇక శ్రీశైలంలో 885 అడుగుల మట్టానికి గానూ 829.50 అడుగుల్లో నీటి లభ్యత 53.85 టీఎంసీలు ఉందని, ఇప్పటికే కనీస నీటి మట్టం 834 అడుగుల దిగువకు వెళ్లి 4.86 టీఎంసీల నీటి వినియోగం చేశారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఈ ఏడాది మే ఆఖరు వరకు నీటి అవసరాలపై సమగ్ర ప్రతిపాదనలు పంపాలని కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలను కోరింది. 

మరిన్ని వార్తలు