ఏపీకి 15 టీఎంసీలు 

22 Apr, 2020 03:20 IST|Sakshi

సాగర్‌ నుంచి 13, శ్రీశైలం నుంచి 2 టీఎంసీలు 

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ తాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి 15 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు అంగీకరించింది. సాగర్‌ నుంచి 13 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 2 టీఎంసీలు విడుదల చేసేందుకు సమ్మతించింది. ఈ మేరకు మంగళవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం అధ్యక్షతన, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు మురళీధర్, నారాయణరెడ్డిల సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయం జరిగింది. ఏపీ తన అవసరాలకు సాగర్‌ కుడి కాల్వ కింద 10 టీఎంసీలు, ఎడమ కాల్వ కింద 2, హంద్రీనీవాకు 2 టీఎంసీలు కోరింది.

అయితే ఇప్పటికే శ్రీశైలంలో కనీస నీటిమట్టాలు 854 అడుగులకు దిగువకు వెళ్లి నీటిని తీసుకుంటున్న విషయాన్ని తెలంగాణ దృష్టికి తెచ్చింది. అయితే తమ అవసరాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ దృష్ట్యా 807 అడుగుల వరకు నీటిని వినియోగించుకుంటామని తెలిపింది. తెలంగాణ సైతం తన అవసరాల నిమిత్తం సాగర్‌లో 510 అడుగుల దిగువకు వెళితే తాము అభ్యంతరం చెప్పబోమని తెలిపింది.

ప్రస్తుతం సాగర్‌లో 543 అడుగులకు ఎగువన వినియోగించుకునే నీరు 61 టీఎంసీల మేర ఉండగా, అందులో తెలంగాణ వాటా 53 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి వాటా వాడుకునేందుకు 510 అడుగుల దిగువకు వెళ్లేందుకు అంగీకరించడంతో తెలంగాణ సైతం ఏపీ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఈ 15 టీఎంసీల నీటి విడుదలకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు