హైదరాబాద్‌కు నీటి సరఫరా అంశాన్ని తేల్చండి

30 Jun, 2020 06:11 IST|Sakshi

సీడబ్ల్యూసీకి కృష్ణా బోర్డు లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు తాగు, గృహ అవసరాలకు సరఫరా చేస్తున్న నీటిని లెక్కించడంలో ఎలాంటి విధానాన్ని పాటించాలో సూచించాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్  ఆర్కే జైన్కు కృష్ణా బోర్డు చైర్మన్  ఎ.పరమేశం సోమవారం లేఖ రాశారు. తాగు, గృహ, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీటిలో 20 శాతాన్ని లెక్కలోకి తీసుకోవాలని కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)–1లో క్లాజ్‌–7లో పేర్కొన్నారని.. ఆ మేరకు హైదరాబాద్‌కు తాగు నీటి కోసం సరఫరా చేస్తున్న నీటిలో 20 శాతాన్నే పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ సర్కార్‌ కృష్ణా బోర్డును కోరుతూ వస్తోంది.

హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న నీటిలో తాగు నీటి అవసరాలకుపోనూ.. మిగతా నీరు మురుగునీటి కాలువల ద్వారా మూసీలో కలుస్తున్నాయని.. ఈ నేపథ్యంలో ఆ నీటిని కూడా లెక్కలోకి తీసుకోవాల్సిందేనని ఏపీ స్పష్టంచేస్తూ వస్తోంది. ఈ నెల 4న జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో.. హైదరాబాద్‌కు సరఫరా చేసే నీటిని లెక్కలోకి తీసుకునే అంశంపై సీడబ్ల్యూసీతో అధ్యయనం చేయించి.. నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్  పరమేశం ప్రతిపాదించారు.ఇరు రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాయి. 

మరిన్ని వార్తలు