కదిలిన కృష్ణా బోర్డు!

12 May, 2018 03:46 IST|Sakshi

  ‘వాటా’ర్‌ వార్‌.. కథనానికి స్పందన 

  కృష్ణా జలాల పంపిణీ సమస్యలపై ఈ నెలాఖరులోపు భేటీ 

  13 అంశాలతో ఎజెండాను తెలంగాణ, ఏపీలకు పంపిన బోర్డు 

  వర్కింగ్‌ మాన్యువల్, టెలిమెట్రీ, నీటి వాటాల అంశాలే కీలకం 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల పంపిణీపై వాటర్‌ ఇయర్‌ దగ్గర పడుతున్నా ఇంకా కేంద్రం, బోర్డు దృష్టి సారించలేదంటూ ఈ నెల 9న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘వాటా’ర్‌ వార్‌! కథనంపై కృష్ణా బోర్డు స్పందించింది. వాటర్‌ ఇయర్‌ ఆరంభానికి ముందే సమస్యలు పరిష్కరించుకోకుంటే మళ్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నీటి వివాదాలు తప్పవన్న కథనం నేపథ్యంలో ఈ నెలాఖరులోగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ నెల 29 నుంచి 31 వరకు బోర్డు సమావేశాన్ని నిర్వహించే తేదీని ఖరారు చేసి తమకు తెలియజేయాలంటూ బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం శుక్రవారం ఇరు రాష్ట్రాల ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లకు లేఖలు రాశారు. మొత్తంగా 13 అంశాలను సమావేశపు ఎజెండాలో చర్చించాలని పేర్కొన్న ఆయన ఇతర అంశాలు ఏవైనా సూచిస్తే వాటిని ఈ నెల 18లోగా తమకు పంపాలని రెండు రాష్ట్రాలకు సూచించారు.  

వాటా.. నియంత్రణ.. టెలిమెట్రీలే కీలకం 
ఎజెండాలో 13 అంశాలను పేర్కొన్న బోర్డు ఇందులో ప్రధానంగా వర్కింగ్‌ మాన్యువల్, 2017–18 ఏడాదిలో నీటి వినియోగం, వచ్చే ఏడాది నీటి వాటాల వినియోగం, టెలిమెట్రీ అంశాలను చేర్చింది. ఇందులో వాటాల అంశం చాలా కీలకంగా ఉండనుంది. గతేడాది కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో నీటి వాటాలను ఏపీ, తెలంగాణలు 66:34 నిష్పత్తిలో పంచుకున్నాయి. అయితే ఈ నిష్పత్తిని మార్చా లని తెలంగాణ కోరుతోంది. పట్టిసీమ, పోలవరంతో దక్కే వాటాలను దృష్టిలో పెట్టుకొని 61:39 నిష్పత్తి లో పెంచాలని కోరే అవకాశముంది. దీంతో పాటే కృష్ణాలో తమ వాటా 299 టీఎంసీలకు పట్టిసీమతో దక్కే వాటా 45 టీఎంసీలను కలపాలని ఎప్పటినుంచో పట్టుబడుతోంది.

ఈ అంశమే బోర్డు సమావేశంలో అత్యంత కీలకంగా ఉండనుంది. బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌పైనా భిన్నాభిప్రాయం వ్యక్తమైంది. ప్రాజెక్టులన్నింటినీ తామే నియంత్రిస్తామని ఇప్పటికే బోర్డు కేంద్ర జలవనరుల శాఖ ముసాయిదాను పంపింది. దీన్ని తెలంగాణ తప్పుపడుతోంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేకుండా నియంత్రణ అక్కర్లేదని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. అయితే ఏపీ.. నియంత్రణ అవసరమంటూ పట్టుదలగా ఉండటంతో బోర్డు ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిందే. మరోవైపు ఇప్పటికీ టెలీమెట్రీ మొదటి విడత ఏర్పాటుపై స్పష్టత లేదు. దీన్ని కూడా ఎజెండా అంశాల్లో బోర్డు చేర్చింది. 

మరిన్ని వార్తలు