ప్రొటోకాల్ తేలేనా?

6 May, 2015 01:49 IST|Sakshi
ప్రొటోకాల్ తేలేనా?

8న కృష్ణానది యాజమాన్య బోర్డు కీలక సమావేశం
 
నీటి పంపిణీ, వినియోగంపై
పునఃసమీక్ష కోరుతున్న తెలంగాణ
బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్-15పైనా స్పష్టత కోరే అవకాశం
ఎజెండా అంశాలపై మొదలైన కసరత్తు

 
హైదరాబాద్ కృష్ణా పరీవాహక ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నిర్వహణ, నీటి వినియోగంపై కసరత్తు మొదలైంది. రాష్ట్ర విభజన అనంతరం ఈ అంశాల్లో నెలకొన్న స్తబ్దతను నివారించే పనిని కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రారంభించింది. ఈ నెల 8న జరగనున్న కృష్ణా బోర్డు సమావేశంలో ఉమ్మడిగా ప్రాజెక్టుల నిర్వహణపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి కేటాయింపులు, వినియోగం, ఆపరేషన్ ప్రొటోకాల్‌లపై భిన్న వాదనలు వినిపిస్తున్న తెలంగాణ, ఏపీల మధ్య ఈ అంశాన్ని కొలిక్కి తేవడం అంత సులువు కాదన్నది నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా తయారుచేసిన నీటి ప్రొటోకాల్స్‌లో మార్పులు చేయాలని పట్టుబడుతున్న తెలంగాణ.. ఈ అంశాన్నే మొదట తేల్చాలని బలంగా కోరే అవకాశాలున్నాయి.
 
ప్రాధాన్యతల మార్పులు కోరే అవకాశం


శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగంలో అనుసరించాల్సిన ప్రాధాన్యతల(ప్రొటోకాల్స్)ను పేర్కొంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన జీవో 69, 107లపైనా బోర్డు సమావేశంలో చర్చించే అవకాశముంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్వహణ, ప్రాధాన్యతలను మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఇప్పటికే పలుమార్లు బోర్డుకు స్పష్టం చేసింది. ముఖ్యంగా చెన్నై తాగునీటి అవసరాలకు 3.75 టీఎంసీల నీటి కేటాయింపునకు తొలి ప్రాధాన్యమిస్తూ.. తెలంగాణ నీటి అవసరాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వడంపై అభ్యంతరం చెబుతోంది. కేవలం తెలుగు గంగకు నీటిని తీసుకెళ్లేందుకే కుట్ర పూరితంగా చెన్నై అవసరాలకు ప్రోటోకాల్‌లో తొలి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొంటోంది. ఇక విద్యుదుత్పత్తిలోనూ ఆంధ్రాకు అనుకూలంగానే ప్రోటోకాల్స్ ఉన్నాయని, ఎడమవైపున విద్యుదుత్పత్తి కేంద్రం ఉన్నా, దాని వినియోగంపై నియంత్రణ ఉందని తెలంగాణ అంటోంది.

అలాగాకుండా స్వతంత్రంగా దానిని నడపుకొనేలా ప్రోటోకాల్ మార్చాలని వాదిస్తోంది. ఈ లెక్కన ప్రస్తుత ప్రోటోకాల్స్‌ను మార్చి తాజా మార్గదర్శకాలు రూపొందించడానికి.. సాగునీటి, ఇతర అవసరాలకు సంబంధించిన పూర్తి డేటాను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దానికితోడు జాగ్రత్తగా అధ్యయనం చేసి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఇదంతా పూర్తయి ఓ ఒప్పందానికి వస్తేనే ప్రోటోకాల్‌లో మార్పులు సాధ్యమవుతాయి. లేదంటే బోర్డు కొత్త మార్గదర్శకాలు తయారుచేసే వరకు.. ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ప్రస్తుత ప్రోటోకాల్స్‌నే పాటించాల్సి ఉంటుంది.

అంత సులువేం కాదు..

కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్ నీటి వాడకంపై తెలంగాణ, ఏపీల మధ్య నలుగుతున్న వివాదాన్ని తేల్చడం అంత సులువేం కాదని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. బచావత్ ట్రిబ్యునల్ 15వ అధికరణం కింద ఒక రాష్ట్రం తన పరిధిలోని నీటిని తన సరిహద్దులలో నచ్చిన రీతిలో వాడుకోవడానికి హక్కు కల్పించిందన్న విషయాన్ని తెలంగాణ గతంలోనే తెరపైకి తెచ్చింది. ఈ మేరకే కృష్ణాలో గుండుగుత్తగా జరిపిన కేటాయింపుల్లో ఏపీకి 512.04 టీఎంసీలు (63.14శాతం), తెలంగాణకు 298.96 టీఎంసీల (36.86 శాతం) వాటాలున్నాయని చెబుతూ... సాగర్ ఎగువన వాడుకోలేకపోయిన నీటిని తెలంగాణ రాష్ట్రం సాగర్ నుంచి వాడుకుంది. దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. ఏ ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని అక్కడే అదే సమయంలో వాడాలి తప్ప, మొత్తం కేటాయింపులను ఒకే దగ్గర వాడుకుంటామంటే కుదరదని వాదించింది. ఇలాంటి భిన్న వాదనల నేపథ్యంలో బోర్డు ఏం తేలుస్తుందన్నది కీలకంగా మారింది.
 

మరిన్ని వార్తలు