చిరకాలం గుర్తుండేలా కృష్ణాపుష్కరాలు

22 May, 2016 02:06 IST|Sakshi
చిరకాలం గుర్తుండేలా కృష్ణాపుష్కరాలు

మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు
 

కొల్లాపూర్ : గోదావరి పుష్కరాలను మరిపించేలా కృష్ణాపుష్కరాలను నిర్వహించి చరిత్రలో గుర్తుండిపోయేలా చేస్తామని రాష్ట్ర దేవాదాయశాఖ, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు వెల్లడించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కృష్ణానదీ తీరం వెంట నూతనంగా నిర్మిస్తున్న పుష్కరఘాట్ల పనులను వారు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్‌లోని కేఎల్‌ఐ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. రెండునెలల క్రితం ముఖ్యమంత్రి కే సీఆర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

గతంలో గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను చూసి ఏపీ ప్రజలు కూడా ఇక్కడికే వచ్చి పుణ్యస్నానాలు చేశారని గుర్తుచేశారు. కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడానికి 86 ఘాట్ల నిర్మాణానికి *212 కోట్లు, ఇతర ఏర్పాట్లకు *825 కోట్లు, కృష్ణాతీరంలోని దేవాలయాల ఆలంకరణ కోసం *4.50కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 15 తేదీలోగా ఘాట్ల పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామని, పనుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపారు.


కొల్లాపూర్‌కు కళ తెస్తాం : జూపల్లి
నల్లమల అంచున ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గానికి పర్యాటకంగా, ఆహ్లాదభరితంగా, ఆలయాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇప్పటికే దేవాదాయ శాఖ, ఇతర శాఖల అధికారులకు సూచించారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కనీవిని ఎరుగని రీతిలో కృష్ణాపుష్కరాలను నిర్వహిస్తామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుపై పక్కరాష్ట్రం నాయకులు చేస్తున్న విమర్శలకు ఇక్కడి నాయకులు వంత పాడడం సరికాదని, ఉద్యమ స్ఫూర్తితో సీఎం.కేసీఆర్ అభివృద్ధి పనులు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

వచ్చే 3 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో జరగనంత అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీపీలు నిరంజన్‌రావు, వెంకటేశ్వర్‌రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, సింగిల్‌విండో చెర్మైన్ జూపల్లి రఘుపతిరావ్, నాయకులు జూపల్లి రామారావు, సిబ్బది నర్సింహారావు  పాల్గొన్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు