జలసౌధలో కృష్ణా బోర్డు కీలక సమావేశం

6 Jun, 2018 16:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకం, కొత్త ప్రాజెక్టులు, వినియోగం, టెలిమెట్రీల ఏర్పాటు, బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌ తదితర అంశాలపై చర్చించేందుకు కృష్ణా నదీ బోర్డు కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణాబోర్డు ఇన్‌చార్జి చైర్మన్‌ హెచ్‌కే సాహూ అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో బుధవారం జరుగుతున్న సమావేశంలో తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితోపాటు, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు నాగేంద్రరావు, వెంకటేశ్వర్రావు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

2018–19 ఏడాదికిగాను కృష్ణా జలాల్లో తమకు 33 శాతం కాకుండా 50 శాతం నీటి వాటా కేటాయించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణాబోర్డు ఎవరి వాదనకు మొగ్గు చూపుతుంది, ఎలాంటి నిర్ణయాలను ప్రకటిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. సమావేశంలో కృష్ణా బోర్డు మొత్తంగా 13 అంశాలతో ఎజెండా సిద్ధం చేసింది. ఇందులో బోర్డుకు సిబ్బంది, నిధుల కేటాయింపు, వర్కింగ్‌ మాన్యువల్‌ ఆమోదం, మొదటి, రెండో దశ టెలీమెట్రీ పరికరాల ఏర్పాటు, తాగునీటికి కేటాయించిన నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీరు నాగార్జునసాగర్‌కు చేరేటప్పటికి తక్కువగా ఉండటంపై ఏర్పాటు చేసిన కమిటీలిచ్చిన నివేదికలు, 2017–18లో నీటి వినియోగం, 2018–19లో నీరు, విద్యుత్‌ పంపిణీ తదితర అంశాలను పేర్కొంది.

తెలంగాణ చర్చించాలంటున్న అదనపు అంశాలివీ..

ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా ఎక్కువ నీటిని తీసుకుని తక్కువగా చూపించింది. ఈ తేడాను లెక్కల్లోకి తీసుకొని వినియోగం లెక్కించాలి.
గోదావరి నుంచి మళ్లించే నీటిలో తెలంగాణ వాటాను ఏఎంఆర్‌–ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు కేటాయించడంపై చర్చించాలి. 
కేటాయించిన నీటికంటే ఎక్కువ నీటిని వాడుకున్న రాష్ట్రానికి సంబంధించిన వాటాను తర్వాతి ఏడాదిలో తగ్గించడం. 
రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా ఏకపక్షంగా బోర్డు పరిధిపై చైర్మన్‌ కేంద్రానికి లేఖ రాయడంపై చర్చించాలి.

ఏపీ కోరిన అంశాలివీ..
కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు మార్చాలి.
ఆర్డీఎస్‌పై మూడు చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలి.
పాలేరు రిజర్వాయర్‌ నుంచి భక్త రామదాసు ఎత్తిపోతలకు, గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు తెలంగాణ తరలించే 214 టీఎంసీలను పరిగణనలోకి తీసుకోవాలి.
జూరాల ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకోవడంతో పాటు ఆ రిజర్వాయర్‌ నుంచి మొత్తం వినియోగంపై పరిమితులు ఉండాలి.
తెలంగాణ కృష్ణాపై చేపట్టిన కొత్త ప్రాజెక్టులు పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ఎత్తిపోతల డీపీఆర్‌లను బోర్డు, కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ పరిశీలనకు పెట్టాలి.
మిషన్‌ కాకతీయ కింద చెరువులు బాగుపడినందున చిన్న నీటి వనరుల కింద తెలంగాణకు ఉన్న మొత్తం కేటాయింపు 89.15 టీఎంసీలను పరిగణనలోకి తీసుకోవాలి.
జూరాల వినియోగం, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల కింద వినియోగించిన నీటిని తెలంగాణ తక్కువగా చూపుతోంది. దీనిపై చర్చించాలి.

మరిన్ని వార్తలు