కృష్ణమ్మ పరవళ్లు 

24 Sep, 2017 01:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి మరింతగా పెరిగింది. దీంతో శనివారం ఆల్మట్టి జలాశయంలోకి 1,21,316 క్యూసెక్కులు, నారాయణపూర్‌ జలాశయంలోకి 1,32,594 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఆల్మట్టి నుంచి 1,33,492 క్యూసెక్కులు, నారాయణపూర్‌ నుంచి 1,24,396 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు 1,40,694 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా దిగువకు 1,42,303 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ వరదకు సుంకేసుల బ్యారేజీ నుంచి విడుదల చేసిన తుంగభద్ర జలాలు తోడవడంతో శ్రీశైలం జలాశయంలోకి 1,64,068 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దీంతో నీటి మట్టం 865.3 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలో 123.62 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.  శ్రీశైలం కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 72,937 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్‌ నీటిమట్టం 508.1 అడుగులకు చేరుకుంది.  

మరిన్ని వార్తలు