కృష్ణా బోర్డు కేటాయింపులు

10 Jan, 2020 02:47 IST|Sakshi
గురువారం జలసౌధలో భేటీ అయిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు

ఆంధ్రప్రదేశ్‌కు  84 తెలంగాణకు 140 టీఎంసీల జలాలు

వరద రోజుల్లో వినియోగించుకున్న నీటి లెక్కలపై మరోసారి చర్చించాలని నిర్ణయం 

కృష్ణా, గోదావరిబోర్డుల ఉమ్మడి సమావేశంలో వర్కింగ్‌ మాన్యువల్‌పై చర్చ 

రెండో దశలో టెలీమీటర్ల ఏర్పాటుకు నిధులు ఇచ్చేందుకు ఓకే

సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో కనీస నీటి మట్టాలకు ఎగువన అందుబాటులో ఉన్న జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 84, తెలంగాణకు 140 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. వరద వచ్చిన రోజుల్లో వినియోగించుకున్న నీటిని లెక్కలోకి తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ చేసిన ప్రతిపాదనపై మరోసారి చర్చిద్దామని సూచిం చింది. బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌ (కార్యనిర్వాహక నియమావళి)ని కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశంలో చర్చించితుది నిర్ణయం తీసుకుందామని కృష్ణా బోర్డు చైర్మన్‌ డాక్టర్‌ ఆర్కే గుప్తా చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. హైదరాబాద్‌లోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కార్యాలయంలో చైర్మన్‌ డాక్టర్‌ ఆర్కే గుప్తా అధ్యక్షతన బోర్డు గురువారం సమావేశమైంది.

ప్రస్తుత సీజన్‌లో ఇప్పటిదాకా ఏపీ 511, తెలంగాణ 159 టీఎంసీలు వినియోగించుకున్నాయని బోర్డు సభ్య కార్యదర్శి ఎ. పరమేశం వివరించారు.. దీనిపై ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ స్పందిస్తూ.. ఈ ఏడాది శ్రీశైలానికి కృష్ణా నది నుంచి ఎనిమిది దఫాలుగా భారీగా వరద ప్రవాహం  రావడంవల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది 800 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశామన్నారు. సముద్రంలో కలుస్తున్న వరద జలాలను వినియోగించుకున్నామని.. వాటిని లెక్కలోకి తీసుకోవద్దని బోర్డుకు వి/æ్ఞప్తి చేశారు. ఈ అంశంపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోలేమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 13న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉండే అవకాశం ఉందని.. అప్పుడు వారిరువురూ  నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.  

కనీస నీటి మట్టాలకు ఎగువన 233 టీఎంసీలు.. 
కాగా, రబీలో సాగు, వేసవిలో తాగునీటి అవసరాలకు 98 టీఎంసీలు కేటాయించాలని ఏపీ, 157 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ సర్కార్‌ చేసిన ప్రతిపాదనలపై బోర్డు చర్చించింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 66, తెలంగాణకు 34 శాతం చొప్పున కేటాయిస్తూ కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే ఈ ఏడాది నీటి కేటాయింపులు చేస్తామని బోర్డు స్పష్టంచేసింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కనీస నీటి మట్టాలకు ఎగువన ప్రస్తుతం 233 టీఎంసీల నీరు ఉందని.. ఆవిరి నష్టాలు తీసివేయగా మిగిలిన 224 టీఎంసీల్లో ఏపీకి 84, తెలంగాణకు 140 టీఎంసీలను బోర్డు కేటాయించింది. ఇదిలా ఉంటే.. రెండో దశలో టెలీమీటర్ల ఏర్పాటుకు అవసరమైన నిధులను బోర్డుకు విడుదల చేసేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించాయి. ఈ సమావేశంలో ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సీఈ మురళీనాథ్‌రెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ సర్కార్‌ తరఫున ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు