‘మిగులు’ పంపకాలపై దృష్టి!

13 May, 2020 05:03 IST|Sakshi

కృష్ణా మిగులు జలాల పంపకంపై నేడు కృష్ణా బోర్డు భేటీ 

వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరు రాష్ట్రాల అభిప్రాయాల సేకరణ 

గోదావరి మిగులు జలాల వాటాపైనా తెలంగాణ ప్రణాళిక 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ బేసిన్‌లో మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీచేసే అంశంపై కృష్ణా బోర్డు దృష్టి పెట్టింది. మిగులు జలాల అంశాన్ని ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉన్నా, అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాకపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య తాత్కాలిక ఒప్పందాన్ని కుదిర్చే చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే జూన్‌లో వాటర్‌ ఇయర్‌ ఆరంభానికి ముందే బోర్డు ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి, ఒక అవగాహనకు వచ్చేందుకు వీలుగా బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి కేంద్ర జల వనరుల శాఖ ఆమోదం మేరకు వచ్చే వాటర్‌ ఇయర్‌లో దాన్ని అమలు చేయనుంది.  
(చదవండి: అక్రమం.. అడ్డుకోండి: సీఎం కేసీఆర్‌)

ఇప్పుడన్నా బోర్డు తేల్చేనా..? 
బజావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీ, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఈ నీటిని ప్రాజెక్టుల వారీగా ఇంత అని నిర్ణయించకపోవడంతో ఆయా రాష్ట్రాలు వాటి సరిహద్దుల్లోని ప్రాజెక్టుల పరిధిలో ఎక్కడైనా వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నాయి. దాని ప్రకారమే 34:66 నిష్పత్తిన తెలంగాణ, ఏపీ నీటిని వాడుకుంటున్నాయి. అయితే 2019–20 వాటర్‌ ఇయర్‌లో మొత్తం ఇరు రాష్ట్రాల నికర జలాల వాటా 811 టీఎంసీలకు మించి నీరొచ్చింది.

మొత్తం గా 910 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు (ఏపీ–637 టీఎంసీలు, తెలంగాణ–273 టీఎంసీలు) వినియోగించుకోగా, మరో 797 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. ప్రాజెక్టులు నిండి, వృథాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిని రాష్ట్రాల వినియోగం కింద చూడరాదని, వరద నీటిని వాడుకుంటే దాన్ని రాష్ట్రాల వినియోగ లెక్కల్లో చూపరాదని ఏపీ గతంలో బోర్డు భేటీల్లో కోరింది. వరద ఉన్న 32 రోజుల్లో తాము 132 టీఎంసీల మేర నీటిని వినియోగించుకోగా, తెలంగాణ సైతం 39 టీఎంసీల మేర వాడుకుందని సైతం ప్రస్తావించింది. అయితే ఏపీ ప్రతిపాదనకు తెలంగాణ అంగీకరించలేదు. మిగులు జలాల అంశాన్ని ట్రిబ్యునల్‌ తేల్చడం ఆలస్యమవుతున్నందున బోర్డు, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శనం చేయాలని కోరింది.
(చదవండి: దుమ్ముగూడెం టెండర్లలో భారీ కుంభకోణం)

చేసేది లేక బోర్డు దీనిపై అభిప్రాయాలు తీసుకునేందుకు ఇరు రాష్ట్రాల ఇంజనీర్లతో కమిటీని నియమించింది. ఇందులో బోర్డు సభ్య కార్యదర్శితో పాటు ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తమ అభిప్రాయాలను చెప్పనుంది. ఆయా రాష్ట్రాల ఈఎన్‌సీలు కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కాన్ఫరెన్స్‌ అనంతరం బోర్డు తన నివేదికను కేంద్రానికి సమర్పించి, వారి ఆమోదం ప్రకారమే నడుచుకోనుంది.

గోదావరి జలాల అంశమూ తెరపైకి.. 
కొత్తగా తెలంగాణ గోదావరి మిగులు జలాల అంశాన్నీ తెరపైకి తెచ్చింది. గోదా వరిలో తెలంగాణకు 954, ఏపీకి 500 టీఎంసీల మేర వాటాలున్నాయి. ఏటా గోదావరి నుంచి వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తున్నా, మిగులు జలాలపై మాత్రం గతంలో ట్రిబ్యునల్‌ కానీ, కేంద్రం కానీ తేల్చలేదు. ఈ వాటర్‌ ఇయర్‌లోనూ గోదావరిలో 3,788 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసింది. ప్రస్తుతం తెలంగాణ వాటా 954 టీఎంసీల మేరకు నీటి వినియోగం చేసేలా ప్రాజెక్టులు పూర్తయినందున, అంతకుమించి నీటిని తీసుకునేలా మిగులు జలాల వాటాను తెరపైకి తెచ్చింది. కనీసంగా 600 టీఎంసీల వాటా దక్కించుకునేలా ప్రణాళిక రచిస్తోంది. దీనిపైనా గోదావరి బోర్డుకు లేఖ రాయాలని, అటు నుంచి వచ్చే అభిప్రాయాల మేరకు కేంద్రం వద్ద పోరాడాలని భావిస్తోంది.   

మరిన్ని వార్తలు