కాలుష్య నివారణ చర్యలేవి..?

26 Nov, 2014 23:21 IST|Sakshi

 మంచాల: ఫ్లొరైడ్ పీడిత ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగు నీరును అందించాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సరఫరా చేస్తున్న కృష్ణా జలాలు అడుగడుగునా కలుషితమవుతున్నాయి. వీటిని తాగాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. నాగార్జునసాగర్ నుండి వచ్చే  కృష్ణా జలాలను గున్‌గల్ రిజర్వాయర్ నుండి  ఈ ప్రాం తంలోని కందుకూరు, యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాలకు సంబంధించిన 134 గ్రామాలకు ప్రభుత్వం సరఫరా చేస్తోంది.

ఇందుకు ప్రభుత్వం  2007లో రూ.18కోట్లను ఖర్చు పెట్టింది.  ప్రత్యేకంగా 12 ట్యాంకులు, సంఫులను నిర్మించింది.   నీటి సరఫరాకు 60మందికి పైగా  సిబ్బంది పని చేస్తున్నారు.  వీరు ఈ కృష్ణా జలాలు ఎక్కడా లీకేజి ,వృధా, కలుషితం గాకుండా చర్యలు తీసుకోవాలి. కాని గ్రామాలకు ఎక్కడా స్వచ్ఛమైన కృష్ణా జలాలు అందండం లేదు.

 లీకేజీల మయం...
 కృష్ణాజలాలు అనేకచోట్ల లీకేజీల రూపంలో వృధా కావడమే కాక తాగడానికి పనికిరాని విధంగా కలుషితమవుతున్నాయి.  ప్రధానంగా గున్‌గల్‌నుండి లోయపల్లివరకు పైపు లైన్ పరిధిలో ఎల్లమ్మతండ-రంగాపూర్ , గున్‌గల్-గడ్డమల్లాయ్యగూడెం , ఆగాపల్లి- నోముల, నోముల- లింగంపల్లి మధ్య,..అలాగే జాపాల-బండలేమూర్ పైపు లైన్ పరిధిలో జాపాల ప్రభుత్వ పాఠశాల , ఆరుట్ల సమీపంలోని  వ్యవసాయ పొలాల వద్ద ,.. మంచాల -తిప్పాయి గూడ పైపులైన్ పరిధిలో  చిత్తాపూర్ వద్ద తరుచూ గేట్ వాల్వ్‌లు లీకేజీలు అయి నీరు నేలపాలవుతున్నాయి.

 నాగార్జున సాగర్- హైదారాబాద్ రహదారిపై  ఏకంగా ప్రయాణికులు ఈ నీటితోనే స్నానాలు చేస్తున్నారు.  ఆగాపల్లి-గురునానక్ కళాశాల మధ్య పారెస్టు సమీపంలో రెండు,మూడు చోట్ల గేట్ వాల్వ్‌ల వద్ద కృష్ణా జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి.  ఒక చోట గేదెలు, గొర్రెలు,మేకలు వంటి జంతువులను గేట్ వాల్వ్ నుండే నీరు  తాగిస్తున్నారు.మరో చోట  ప్రయాణికులు గేట్‌వాల్వ్ వద్ద నీటిని లీక్ చేసి అందులో నుండే నీళ్లు తోడుకొని  స్నానాలు చేస్తున్నారు. దుస్తులు ఉతుక్కుంటున్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, కృష్ణా నీటి సరఫరా విభాగం సిబ్బంది  కనీస పర్యవేక్షణ కూడా ఉండడంలేదు.  ఇదే విషయంపై ఆర్‌డబ్ల్యుఎస్ డీఈఈ  విజయలక్ష్మిని వివరణ కోరగా గ్రామాల్లో  గేట్ వాల్వ్‌లు ఎక్కడెక్కడ  లీకేజీ అవుతున్నాయో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు