రేపు జూరాలకు 

13 Jul, 2020 01:31 IST|Sakshi
కర్ణాటకలోని నారాయణపూర్‌ డ్యామ్‌ నుంచి జూరాల వైపు ప్రవహిస్తున్న కృష్ణమ్మ

పశ్చిమ కనుమల్లో వర్షాలతో నారాయణపూర్‌ గేట్లెత్తిన కర్ణాటక

ప్రాజెక్టు నుంచి 26 వేల క్యూసెక్కుల కృష్ణా జలాలు విడుదల

ఈ నీరంతా ప్రాజెక్టులోకి మంగళవారం చేరే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత వాటర్‌ ఇయర్‌లో తొలిసారి ఎగువ ప్రాజెక్టుల నుంచి దిగువకు కృష్ణా నదీ ప్రవాహాలు మొదలయ్యాయి. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్‌కు నీటి ప్రవాహాలు పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్‌ డ్యామ్‌ రెండు గేట్లను ఎత్తి నదిలోకి నీటిని వదిలిపెడుతోంది. ఈ నీరంతా దిగువన జూరాల వైపుగా తన ప్రయాణం మొదలు పెట్టగా, మంగళవారానికి నీరు జూరాలకు చేరే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. 

దిగువకు పరుగు... 
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కర్ణాటక, మహారాష్ట్రలో వాగులు, వంకలన్నీ ఉప్పొంగుతున్నాయి. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టులో వరద పెరిగింది. ఆదివారం ప్రాజెక్టులోకి 69,868 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో నిల్వ 129 టీఎంసీలకు 98 టీఎంసీలు చేరింది. ఇప్పటివరకు ప్రాజెక్టులోకి కొత్తగా 78 టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టులో మరో 31 టీఎంసీల మేర ఖాళీ ఉన్నప్పటికీ ఎగువ నుంచి ప్రవాహాలు మరో వారంపాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి 36,130 క్యూసెక్కుల నీటిని పవర్‌హౌస్‌ల ద్వారా దిగువకు వదులుతున్నారు. దీంతో నారాయణపూర్‌లోకి ప్రవాహాలు మరింత పెరిగాయి. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 39,720 క్యూసెక్కుల నీరు వస్తోంది. అందులో నీటి నిల్వ 37.64 టీఎంసీలకుగాను 33.47 టీఎంసీలు ఉంది.

మొత్తంగా ఆల్మట్టి, నారాయణపూర్‌లలో 35 టీఎంసీల మేర నిల్వలు ఖాళీగా ఉన్నప్పటికీ ఎగువ నుంచి ప్రవాహాలు కొనసాగే అవకాశాలు ఉండటంతో నారాయణపూర్‌ రెండు గేట్లను ఒక మీటర్‌ మేర ఎత్తి ఆదివారం ఉదయం 11,240 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలారు. సాయంత్రానికి నీటి విడుదలను 26 వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ నీరంతా కర్ణాటకలోనే ఉన్న గూగుల్, గిరిజాపూర్‌ బ్యారేజీలను దాటుకుంటూ మంగళవారం నాటికి జూరాలకు చేరే అవకాశం ఉంది. జూరాలకు ఇప్పటికే స్థానిక పరీవాహకం నుంచి 4,140 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఇక్కడ నిల్వ 9.66 టీఎంసీలకుగాను 8.10 టీఎంసీలు ఉన్నాయి.

జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా ద్వారా 1,445 క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహాలు పెరిగే అవకాశాల నేపథ్యంలో సోమ లేదా మంగళవారం నుంచి పవర్‌హౌస్‌ ద్వారా నీటిని దిగువనున్న శ్రీశైలానికి వదిలే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ప్రవాహాలు మరింత ఉధృతంగా ఉంటే జూరాల గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఇక శ్రీశైలానికి 2,557 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా నీటి నిల్వ 215 టీఎంసీలకుగాను 37.25 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్‌కు 1,202 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 312 టీఎంసీలకుగాను 168.35 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 11,102 క్యూసెక్కుల మేర ప్రవాహాలు పెరిగాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ 90 టీఎంసీలకుగాను 33.60 టీఎంసీలుగా ఉంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా