మళ్లీ కృష్ణాజలాల కేటాయింపులు

19 Oct, 2014 02:01 IST|Sakshi
మళ్లీ కృష్ణాజలాల కేటాయింపులు

* ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది
* ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం
* అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం చేస్తాం
* నీటి ఎద్దడి ప్రాంతాల్లో తాగునీటి కోసం కొత్త పథకం
* చతుర్విధ, సమీకృత విధానాల ద్వారా జల వనరుల అభివృద్ధి
 * నవంబర్ రెండో వారంలో ‘జల్ మంథన్’

 
సాక్షి, హైదరాబాద్: కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి తిరిగి అన్ని రాష్ట్రాలకు కేటాయిం పులు జరిపే అంశాన్ని కేంద్రప్రభుత్వం పరి శీలిస్తోందని కేంద్ర జలవనరుల శాఖ సలహా దారు వెదిరె శ్రీరాం పేర్కొన్నారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీరాం ఇటీవలే సలహాదారుగా నియమితులయ్యారు. జల వనరులపై విస్తృతంగా అధ్యయనం చేసిన ఆయన.. నదుల అనుసంధానం, సమీకృత పద్ధతుల్లో నదుల అభివృద్ధి అనేవే అన్ని సమస్యలకు పరి ష్కారమని చెబుతున్నారు. వెదిరె శ్రీరాం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు..
 సాక్షి: తెలంగాణ వారికి జాతీయ స్థాయిలో కీలకమైన పదవి దక్కింది. రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం ఉంటుందని ఆశించవచ్చు?
 శ్రీరాం: తెలంగాణ సమస్యల్లో జలవనరుల్లో వెనకబాటుతనం కూడా ఒకటి. గోదావరి జలాలు తెలంగాణకు ప్రాణ ప్రదమైనవి. వీటిని తెలంగాణకు, సీమాంధ్రకు వినియోగించుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూస్తాం.
  కృష్ణా నది నీటి కేటాయింపులను మళ్లీ కొత్త చేపట్టాలనే డిమాండ్‌పై మీరేమంటారు?
 బ్రిజేష్ ట్రిబ్యునల్ పరిధి ఎలా ఉండాలన్న అం శంపై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. అది పరి శీలనలో ఉంది. అవార్డు నోటిఫై చేసే ప్రక్రియ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడింది. అందరికీ న్యాయం జరిగేలా ట్రిబ్యునల్ పరిధి ఏమిటనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది.
   తిరిగి కేటాయింపులు జరిపేలా ట్రిబ్యునల్ పరిధిని నిర్వచించే అవకాశం ఉందా?
 అవును.. పరిశీలనలో ఉంది.
  పోలవరంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ఉద్యమం నిర్వహిస్తామంటోంది కదా..?
  ఇదొక ప్రహసనంలా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా చూడడం సరికాదు.
  పోలవరం డిజైన్ మార్చే అవకాశం ఉందా?
 ఆ రాష్ట్రంతో మాట్లాడాల్సి ఉంటుంది. మార్చేం దుకు పోలవరం అథారిటీకి అధికారం ఉంటుంది. అది చూసుకుంటుంది. డిజైన్ మారిస్తే లాభం ఎక్కువగా ఉంటుందని అనుకున్నప్పుడు, ఆ రాష్ట్రం అంగీకరించినప్పుడు.. మార్చేందుకు ఆస్కారం ఉంటుంది.
  మరి ఇంకా పోలవరం అథారిటీ ఏర్పాటు చేయలేదు. నిధులు కేటాయించలేదు కదా..?
 అలాంటిదేం లేదు. ఏడు ముంపు మండలాలను బదిలీచేశాం. ఒక ప్రక్రియలో ఒకదాని తరువాత ఇంకొకటి జరుగుతుంది. విధివిధానాలు అన్నీ తయారయ్యాయి. అథారిటీ ఏర్పాటవుతుంది.  
  నదుల అనుసంధానం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఎంతవరకు మేలు జరుగుతుంది? ఎన్డీయే ఇంతకుముందు ప్రతిపాదించిన ప్రణాళికలో భాగంగా మూడు లింకులు ఉన్నాయి. ఒక్కటి ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు, ఇచ్చంపల్లి నుంచి టెయిల్‌పాండ్‌కు, మూడోది పోలవరం నుంచి కృష్ణా బ్యారేజీకి.. మూడోది ప్రారంభమైంది. కానీ మొదటి రెండు కాలేదు. దానికి కారణం ఇచ్చంపల్లి ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడం. దానికి బదులు గోదావరి మీద సూరారం వద్ద మేజర్ డ్యాం కట్టుకోవచ్చు. అక్క డ్నుంచి సాగర్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. ఇది మేజర్‌లింక్ అవుతుంది. 300 టీఎంసీలను వాడుకోవచ్చు. తెలంగాణకు వాడుకొని సీమాం ధ్రకు తీసుకెళ్లొచ్చు. సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీలను వినియోగించుకోవచ్చు.
  ఎస్సారెస్పీ రెండో దశకు పరిష్కారమెలా?
 ఎస్సారెస్పీ ప్రాజెక్టు సామర్థ్యం 130 టీఎంసీల నుంచి పూడిక కారణంగా ఇప్పుడు 70 టీఎంసీలకు పడిపోయింది. 15లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సింది. వీటి పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సి ఉంది. ఎస్సారెస్పీ నుంచి గ్రావిటీ వాటర్ వస్తుంది కాబట్టి అదొక వరం.
   రాష్ట్రాలను ఎలా భాగస్వాములను చేస్తారు?
 నవంబర్‌లో ‘జల్‌మంథన్’ అనే కార్యక్రమం కింద మూడురోజుల సదస్సు ఏర్పాటుచేస్తున్నాం. దీనిలో అన్ని రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. సలహాలను నివేదిక రూపొందించి కేబినెట్ నోట్ రూపొందించి పాలసీ రూపకల్పన చేస్తాం.

మరిన్ని వార్తలు