‘కృష్ణా’లో మనకు 100 టీఎంసీలే!

30 Nov, 2017 02:42 IST|Sakshi

ఆగస్టు వరకు తాగు, సాగు అవసరాలకు ఈ నీరే వినియోగం  

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్న కృష్ణా జలాలు పోనూ లభ్యత జలాల్లో ఇప్పటికే నిర్ణయించిన వాటా (66:34) మేరకు ఏపీకి 152 టీఎంసీలు, తెలంగాణకు 101.33 టీఎంసీలు దక్కే అవకాశం ఉంది. ఈ వంద టీఎంసీల్లోంచే వచ్చే ఆగస్టు వరకు తాగు, సాగు అవసరాలకు నీటిని వినియోగించుకోవాల్సి ఉంది. నిజానికి ఈ ఏడాది నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టాలకు ఎగువన మొత్తంగా 510.84 టీఎంసీల మేర లభ్యత జలాలు ఉండగా ఇందులో 247.94 టీఎంసీల వినియోగం జరిగింది.

వినియోగపు నీటిలో తెలంగాణ 69.10 టీఎంసీలు, ఏపీ 178.84 టీఎంసీలు వినియోగించుకుంది. లభ్యతగా ఉన్న 262.90 టీఎంసీల్లో సరఫరా నష్టాలు 9.56 టీఎంసీలుపోనూ మిగతా నీటిలో ఏపీకి 152 టీఎంసీలు, తెలంగాణకు 101.33 టీఎంసీలు దక్కనున్నాయి. ఈ నీటిలో సాగర్‌ ఎడమ కాల్వ కింది సాగు అవసరాలకే 41 టీఎంసీలు అవసరం ఉంటుంది. బుధవారం బోర్డుకు సమర్పించిన ఇండెంట్‌లో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నీటిలో 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనుంది. ఇక నల్లగొండ, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు, మిషన్‌ భగీరథ అవసరాలకు మొత్తంగా 25 టీఎంసీలు కోరింది.

మరో 10 టీఎంసీలు కల్వకుర్తికి, ఏఎంఆర్‌పీ అవసరాలకు 10 టీఎంసీలు కావాలని అడిగింది. కల్వకుర్తిలో 25 టీఎంసీలతో 2.55 లక్షల ఎకరాలకు నీరివ్వాలని మొదట నిర్ణయించారు. అయితే ఇప్పటికే కల్వకుర్తి కింద 10.68 టీఎంసీల మేర వినియోగం జరగడంతో ప్రస్తుత లభ్యత దృష్ట్యా మరో 10 టీఎంసీలనే బోర్డు కేటాయించే అవకాశం ఉంది. ఈ లెక్కన అక్కడ నిర్ణీత ఆయకట్టు తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక జూరాల కింద 50 వేల ఎకరాలు, ఆర్డీఎస్‌ కింద 20 వేలు, నెట్టెంపాడు 50 వేలు, భీమా 44,450, కోయిల్‌సాగర్‌ 12 వేల ఎకరాలకు నీరివ్వాలని నీటిపారుదలశాఖ నేతృత్వంలోని సమీకృత నీటి నిర్వహణ, ప్రణాళిక కమిటీ నిర్ణయించింది.

అయితే ప్రస్తుతం పేర్కొన్న అవసరాల్లో వాటి వివరాలు లేవు. ఇక మధ్యతరహా ప్రాజెక్టులైన మైసీ, పాకాల, వైరా, లంకసాగర్, డిండిల కింద సైతం 30 వేల ఎకరాల మేర ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉంది. వాటికి 3 నుంచి 4 టీఎంసీల నీటి అవసరాలుంటాయి. మరోవైపు ఏపీ సైతం ఏప్రిల్‌ వరకు మొత్తంగా 156 టీఎంసీలు అవసరమని చెబుతుండగా ఆ రాష్ట్రానికి 152 టీఎంసీలు మాత్రమే దక్కే అవకాశం ఉంది. ఆ తర్వాత మే, జూన్, జూలై అవసరాలకు నీటిని ఎక్కడి నుంచి వినియోగిస్తారన్నది పెద్ద ప్రశ్నగానే ఉంది. 

మరిన్ని వార్తలు