ఆ టేస్ట్ వేరు..

11 Jul, 2018 09:21 IST|Sakshi

ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి ‘ఆహా’ర కేంద్రాలు

మూడు తరాలకు కృష్ణానగర్‌ నుంచే సప్లై

ఆర్డరిస్తే ఎంతమందికైనా రెడీ

ఒక్క సినిమా.. అందులోని ఒక్క పాట.. సినిమా వాళ్ల జీవితాలను కళ్లముందుంచింది. కళామతల్లిని నమ్ముకుని 24 క్రాఫ్ట్స్‌లో పనిచేస్తున్న వారి జీవన శైలిని ‘నేనింతే..’ సినిమా ద్వారా పూరీ జగన్నాథ్‌ కళ్లకుకట్టాడు. ప్రేక్షకులను రంగుల ప్రపంచంలోకి తీసుకువెళ్లే సినిమా వాళ్లకు ఉదయం నోరూరించే టిఫిన్‌ దగ్గర్నుంచి మధ్యాహ్నం అమోఘమైన లంచ్, రాత్రి వేళలో పసందైన డిన్నర్‌ను అందించేందుకు ఏళ్లుగా కొన్ని ఆహార కేంద్రాలు పనిచేస్తున్నాయి.

బంజారాహిల్స్‌: కృష్ణానగరే మామ.. కృష్ణానగరే మామ.. అంటూ సాగే పాటను ‘నేనింతే..’ సినిమా కోసం పూరి జగన్నాథ్‌ స్వయంగా దగ్గరుండి రాయించుకున్నాడు. 24 క్రాఫ్టులకు వేదికైన ఈ ప్రాంతం ఎంతో మంది కళాకారులకు ఆవాసం.. అలాంటి ఈ ప్రాంతం కేవలం ఔత్సాహిక కళాకారులకే కాదు.. ఎంతో మందికి జీవనమిస్తోంది.. ఎందరికో జీవితాన్ని ఇస్తోంది.. అన్నం పెట్టే అన్న‘పూర్ణ’ ప్రాంతంగా నిలుస్తోంది.. అందుకే.. కృష్ణానగర్‌లో ఏ ఘట్టమైనా అమోఘమే.. చవులూరించే రుచులను పంచే అద్భుతమే.. సినిమా పరిశ్రమ నగరానికి తరలివచ్చింది మొదలు.. ఇక్కడే అనేక రకాల ఆహార కేంద్రాలు సినిమా పరిశ్రమతో ముడిపడి నాటికి.. నేటికి రుచులను పంచే కృష్ణానగర్‌ ప్రాంతంగా నిలుస్తున్నాయి.

అల్పాహారం, భోజనం ఇక్కడి నుంచే..
సినిమా పరిశ్రమకు కృష్ణానగర్‌ ప్రాంతం ఎంతో ప్రత్యేకం. పూరి జగన్నాథ్‌ పాట రాయించుకోవడం వెనుక కృష్ణానగర్‌కు ఉన్న గొప్పతనమది. కృష్ణానగర్‌లోనే తన జీవితం మొదలైన నేపథ్యంలో ఆయనకున్న ప్రత్యేక అభిమానంతో కృష్ణానగర్‌పై ఆయన సినిమాలో పాట రూపుదిద్దుకుంది. ఔత్సాహిక కవులు, కళాకారులు, కథారచయితలు, సంగీత దర్శకులు, నిర్మాతలు, దర్శకులు చాలా మంది ఇక్కడి నుంచి ఎదిగిన వారే ఉంటారు. అభిమానులకు మంచి సినిమాలను అందించే సినిమా పరిశ్రమకు మంచి రుచి గల అల్పాహారం నుంచి మొదలుకొని భోజనాలు ఇక్కడి నుంచే వెళ్తుంటాయి. ఇలా సినీ పరిశ్రమ ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి వారితో ముడిపడి ఉన్నాయి.

ఇవి లేకుంటే అసం‘పూర్ణ’మే..!
కృష్ణానగర్‌లోని ఓ చిన్న గల్లీలో ఉండే అల్పాహార కేంద్రం పూర్ణ టిఫిన్‌ సెంటర్‌. ఈ పేరు చెప్పగానే హీరోలు అభిమానులకు ఎంత పరిచయమో ఇండస్ట్రీలోనూ ప్రతి ఒక్కరికి పరిచయం అవసరం లేని ప్రాంతం. ఇదే కాదు.. మంగ టిఫిన్‌ సెంటర్, ఆర్‌ఆర్‌ ఇలా అనేక అల్పాహార కేంద్రాలు ఇక్కడ సినీపరిశ్రమతో కలిసి పాతికేళ్లకు పైగా ప్రయాణం చేస్తున్నాయి. అక్కినేని వంశానికి చెందిన మూడు తరాలు అప్పటికీ, ఇప్పటికీ పూర్ణ టిఫిన్‌ సెంటర్‌ నుంచే అప్పుడప్పుడే అల్పా హార రుచిని చూస్తుంటారు. అలాగే మంచు కుటుంబం, దాసరి కుటుం బం, అల్లు, చిరంజీవి ఇలా ప్రతి ఒక్కరూ ఇక్కడి రుచులు నేటికి చూస్తున్నవారే. ఇక్కడ లభించే నేతి ఇడ్లీలు, ఉప్మా పెసరట్టు రుచులు పరిశ్రమలోని ప్రతి ఒక్కరిని ఇటువైపు ఇప్పటికి వచ్చేలా చేస్తున్నాయి. ఇక మంగ, ఆర్‌ఆర్, నారాయణ టిఫిన్‌ సెంటర్‌ ఇలా అనేక రకాల టిఫిన్‌ సెంటర్లు నాటి తరం నుంచి నేటి తరం వరకు రుచిని చూపుతున్నాయి. 

అక్కడ లొకేషన్‌..కృష్ణానగర్‌లో ప్రిపరేషన్‌
సినిమా ఇండస్ట్రీకి అవసరమైన ఆహారమంతా కృష్ణానగర్‌ ప్రాంతం నుంచే వెళ్తుంది. కృష్ణానగర్‌లో ఇలా సినిమా షూటింగ్‌లకు ఆహారాన్ని సరఫరా చేసే దాదాపు ఐదారు కేంద్రాలున్నాయి. షూటింగ్‌ షెడ్యూలు, వారి మెనూకు అనుగుణంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళ ఇక్కడి నుంచే వంటలు వండి పంపుతారు. వెజ్, నాన్‌వెజ్‌ అంతా ఇక్కడ వండి వేడివేడిగా క్యారేజీలలో పెట్టి పంపుతారు. ఇందుకోసం ప్రత్యేక క్యారేజీలను ఏర్పాటు చేస్తారు. ఒకేసారి వందల మందికి ఇక్కడి నుంచి వండి తీసుకెళ్లడమే కాకుండా వేడివేడిగా వడ్డిస్తారు. కేవలం నగరంలో జరిగే షూటింగ్‌ లోకేషన్లకే కాదు.. పెద్ద సినిమాలు దేశంలో ఏ మూలన షూటింగ్‌ జరిగినా వీరిని వెంట తీసుకెళ్తారు. అంతలా ఇండస్ట్రీతో ఈ రంగం పెనవేసుకొంది. కృష్ణానగర్‌లో దాదాపు పాతికేళ్లకు పైగా ఉన్న రమేష్‌ మెస్, సూపర్‌గుడ్‌ మెస్, బాబాయిమెస్‌లతోపాటు సత్తార్, సాయిగణేష్‌ ఇలా అనేక రకాలైన మెస్‌లు సినీ పరిశ్రమకు అవసరమైన భోజన రుచులను అందిస్తున్నాయి. 

అద్దెకు ఇక్కడి నుంచే..
సినిమా షూటింగ్‌ లోకేషన్లకు అవసరమైన క్యారేజీలు కృష్ణానగర్‌ ప్రాంతంలోనే అద్దెకిస్తారు. ఇలాంటి అద్దెకిచ్చే వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. టిఫిన్‌కు, భోజనానికి ప్రత్యేకంగా తయారు చేయించిన పెద్దపెద్ద క్యారేజీలను అవసరమైన వారికి వీరు అద్దెకు ఇస్తుంటారు. ఇలా రోజులవారీగా లేక నెలల వారీగా అద్దెకు ఇస్తుంటారు. వీరిచ్చే క్యారేజీలు ఎంతమందికి భోజనం కావాలన్నా అందించేలా ఉంటాయి. ఒక్క పెద్ద క్యారేజీ తీసుకొంటే దాదాపు 20 నుంచి 27 మందికి సరిపోయేలా సెటప్‌ చేసి ఇస్తుంటారు. ఇలా ఎంతమందికి కావాలన్నా ఆ సంఖ్యకు అనుగుణంగా క్యారేజీలను అద్దెకిస్తుంటారు. కేవలం క్యారేజీలే కాకుండా వారికి అవసరమైన ప్రతి వస్తువును ఇక్కడ అద్దెకిస్తారు.

ఇరవై ఏళ్లకు పైగా..
సినిమా ఇండస్ట్రీతో దాదాపు 20ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. 1994లో ఈ టిఫిన్‌ సెంటర్‌ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు ఇక్కడి నుంచి అనేక మంది టిఫిన్‌ తీసుకెళుతుంటారు. ఇండస్ట్రీలో దాదాపు మూడు తరాల వారికి మా టిఫిన్‌ రుచిని చూపిస్తూ వస్తున్నాం. అప్పటికి ఇప్పటికీ అదే రుచి. అందుకే.. ప్రతి ఒక్కరూ ఎంతో అభిమానిస్తారు. ఇక్కడి నుంచి పలువురు సినీప్రముఖులు, రాజకీయ ప్రముఖులకు ప్రతి రోజు పార్శిల్‌ పంపుతుంటాం. వారికే కాదు.. ఇక్కడ ప్రతి ఒక్కరికి అందించే టిఫిన్‌ విషయంలో తేడా లేకుండా జాగ్రత్తగా నిర్వహిస్తున్నాం.
– నాగేశ్వర్‌రావు, పూర్ణ టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకుడు

 
షూటింగ్‌లకు అద్దెకిస్తాం..
సినిమా షూటింగ్‌లకు అవసరమైన భోజనం, టిఫిన్, టీ, తాగునీరు సరఫరా చేసే సామాగ్రినంతా అద్దెకిస్తాం. 20 ఏళ్లకు పైగా ఇక్కడే ఉంటున్నాం. అవసరాలకు అనుగుణంగా, సంఖ్యకు అనుగుణంగా క్యారేజీల బరువును పెంచుతూ వస్తున్నాం. ఇక్కడి నుంచి రోజుల వంతున, నెలల వంతున అవసరానికి అనుగుణంగా ఆయా సామాగ్రినంతా అద్దెకిస్తాం. దాదాపు వెయ్యి మందికి సరిపోయేలా అద్దెకిచ్చేటువంటి సామాగ్రిని అందుబాటులో ఉంచుతాం. కేవలం నగరంలో షూటింగ్‌లకే కాకుండా ఇతర ప్రాంతాల్లో షూటింగ్‌ జరిగినా ఇక్కడి నుంచే అద్దెకి తీసుకెళ్తుంటారు.
– నాగమణి, కృష్ణానగర్‌

ఎక్కడైనా అందిస్తాం..
దాదాపు పాతికేళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నాం. వందలాది సినిమా షూటింగ్‌లకు భోజనం అందించాం. సినిమా ఇండస్ట్రీలో అవసరమైన వారికి వారి మెనూ ప్రకారం భోజనం వండి పంపిస్తాం. వెజ్‌లో ఆరు రోజులపాటు వేర్వేరు వంటకాలు ఉండేలా చూసుకుంటాం. నాన్‌వెజ్‌లో ఇంటి భోజనాన్ని తలపించేలా చేసి ఇస్తాం. ఇక్కడే కాదు.. వేరే ప్రాంతానికి వెళ్లినా.. మమ్మల్ని తీసుకెళ్తారు. ఒక్కోసారి నెలరోజుల షెడ్యూల్‌కు తగిన విధంగా ప్రిపేర్‌ అయ్యి వెళ్తాం. బాహుబలి సినిమాకు అందులోని తారాగణానికి రుచిని చూపే అవకాశం దక్కడం అదృష్టం. 
– మన్నె శ్రీను, మెస్‌ నిర్వాహకులు, కృష్ణానగర్‌

మరిన్ని వార్తలు