సాగును తీరం చేర్చిన ‘కృష్ణా'!

27 Apr, 2015 03:27 IST|Sakshi
సాగును తీరం చేర్చిన ‘కృష్ణా'!

* 2014-15లో సాగర్, ఎస్‌ఎల్‌బీసీ కింద లక్ష్యం మేరకు ఆయకట్టుకు నీరు
* ఖరీఫ్‌లో 5.3 లక్షలు, రబీలో 3.50 లక్షల ఎకరాలకు జలసిరి

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కృష్ణా నది పరీవాహకం కింది ఆయకట్టుకు ఈ ఏడాది (2014-15) పూర్తిస్థాయిలో సాగునీరు అందింది. గతంలో ఖరీఫ్ పంటలకు చాలీచాలని నీరు... రబీలో క్రాప్ హాలిడేలు ఎక్కువగా ఉండే నాగార్జునసాగర్ కింది ఆయకట్టుకు ఆశించిన స్థాయిలో సాగునీరు అందించడంలో ప్రభుత్వం సఫలమైంది. ఏపీతో ఉన్న వివాదాలను పరిష్కరించుకొని లభ్యత జలాలను సమర్థంగా వాడుకోవడం, నీటి నిర్వహణను ప్రభావవంతంగా చేయడంతో తక్కువ నీటితోనే ఎక్కువ ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.
 
 తక్కువ నీరు..ఎక్కువ ఆయకట్టు: కృష్ణాలో మొత్తంగా ఈ ఏడాది 585 టీఎంసీల మేర లభ్యత జలాలు ఉండగా అందులో 38 శాతం వాటా లెక్కన తెలంగాణకు 216 టీఎంసీలు దక్కాయి. అందులో సాగర్ కింద నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 6 లక్షల ఎకరాలకుగానూ ఖరీఫ్‌లో 104 టీఎంసీలతో 5.22 లక్షల ఎకరాలకు, ఆరుతడి పంటలు ఎక్కువగా సాగుచేసే రబీలో 35 టీఎంసీలతో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరందించారు. ఎస్‌ఎల్‌బీసీ కింద 2.22లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యానికి గానూ 13.5 టీఎంసీలతో 1.7 లక్షల ఎకరాలకు నీరిచ్చారు.  అదే 2013-14లో సాగర్ ఎడమ కాల్వ కింద ఏపీలోని నూజివీడు, మైలవరం ఆయకట్టును కలుపుకొని ఖరీఫ్‌లో 165 టీఎంసీలతో 6.9 లక్షలు, రబీలో 63 టీఎంసీలతో 4.3 లక్షల ఎకరాలకు నీరిచ్చారు.
 
జోన్-3 కిందకు వచ్చే ఆంధ్రా ప్రాంతంలోని ఆయకట్టే సుమారు 3 లక్షల వరకు ఉంటుంది. ఆ ఆయకట్టును తీసేస్తే తెలంగాణ  ఆయకట్టు ఖరీఫ్‌లో 4.5 లక్ష లు, రబీలో 2.5 లక్షలు మించలేదు. ఇక 2012-13లోనైతే నీటి కొరత కారణంగా ఎడమ కాల్వ కింద జోన్-3ని కలుపుకొని మొత్తంగా 9 లక్షల ఎకరాల్లో కేవలం 2.5 లక్షల ఎకరాలు, రబీలో కేవలం 60 వేల ఎకరాలకే నీరిచ్చారు. 2012-13, 2013-14లతో పోలిస్తే ప్రస్తుత ఏడాది సాగర్ కింద సాగైన ఆయకట్టు చాలా ఎక్కువని నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి. నీటి వాడకంపై నిరంతర పర్యవేక్షణ వల్లే ఆయకట్టు లక్ష్యాలు సాధ్యమయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగ ర్ కుడికాల్వ కింద గుంటూరు కింద 6.69 లక్షలు, ప్రకాశం కింద 4.49 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకే ఎక్కువ చొరవ చూపేవారని, దీంతో ఎడమ కాల్వకింద ఆయకట్టుకు నీరందేది కాదని, కానీ ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరికిందని వారంటున్నారు.
 
 కొత్తగా 1.6 లక్షల ఎకరాలు..
 కృష్ణా జలాలపై ఆధారపడిన మహబూబ్‌నగర్ జిల్లాలోని 3 ప్రాజెక్టుల కింద కొత్త ఆయకట్టుకు నీరందించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. జూన్ చివరికల్లా నెట్టెంపాడు (22 టీఎంసీలు), కల్వకుర్తి (25టీఎంసీలు), భీమా (20టీఎంసీలు) ప్రాజెక్టు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి లక్ష్యం మేరకు 1.66 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని భావిసు ్తన్నారు. ప్రాజెక్టుల కింద పూర్తి సాగు లక్ష్యం 7.40 లక్షల ఎకరాలు ఉండగా ఇందులో ఇప్పటికే 30 వేల ఎకరాలకు నీరందిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో అందే ఆయకట్టును కలుపుకుంటే మొత్తంగా అది 2 లక్షలకు చేరుతుంది. మిగతా లక్ష్యాన్ని 2016 జూన్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు