పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ కు బాధ్యతలు

27 Apr, 2016 05:10 IST|Sakshi
పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ కు బాధ్యతలు

పరిశ్రమల శాఖ అనుబంధ విభాగాల పనితీరుపై ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా కె.తారకరామారావు మంగళవారం సచివాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లూ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు... మంత్రిత్వ శాఖల మార్పిడిలో భాగంగా తాజా శాఖ కేటాయించిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్‌ను పరిశ్రమలు, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు కలసి అభినందించారు.

పరిశ్రమల శాఖ పనితీరుపై మంత్రి ఆరా తీయడంతో పాటు ఆయా విభాగాల్లో సమస్యలు తెలుసుకున్నారు. చేనేత, వస్త్ర పరిశ్రమల విభాగానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. దేశంలో వివిధ విభాగాల్లో నెలకొన్న అత్యున్నత విధానాలను స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఆ దిశగా అధికారులు అధ్యయనం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. మైనింగ్ అక్రమాలను అరికట్టడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు, ప్రజలకు కూడా మేలు జరుగుతుందన్నారు.

తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులను ఆదుకొనే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. గురువారం పరిశ్రమలతో పాటు, చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగంపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తానని కేటీఆర్ చెప్పారు. మంత్రిని కలసిన వారిలో పరిశ్రమల శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం డైరక్టర్ ప్రీతీమీనా, ఆప్కో ఎండీ శైలజారామయ్యర్, టీఎస్‌ఎండీసీ డైరక్టర్ ఇలంబర్తి, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈ.వి.నర్సింహారెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు