ఇక రెండు రోజులే..

30 Mar, 2020 10:19 IST|Sakshi
మూసివేయనున్న కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం కర్మాగారం 

తుది అంకానికి చేరుకున్న కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం కర్మాగారం

పర్యావరణ శాఖ ఆదేశాలతో ఈనెల 31తో మూత 

సాక్షి, పాల్వంచ: సుమారు ఐదున్నర దశాబ్దాల పాటు విద్యుత్‌ కాంతులు విరజిమ్మిన కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం(ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటినెన్స్‌) చరిత్ర తుది అంకానికి చేరుకుంది. పర్యావరణ ఆదేశాల మేరకు ఈ నెల 31తో తన ప్రస్థానానికి ముగింపు పలకబోతోంది. దీంతో 720 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని రాష్ట్రం కోల్పోనుంది. పాల్వంచలోని కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం కర్మాగారాన్ని 1966 – 1978 మధ్య కాలంలో ఏ,బీ,సీ స్టేషన్ల వారీగా 8 యూనిట్లను నిర్మించారు. వీటి ద్వారా 720 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి వెలుగులు అందించింది. ఇంజనీర్లు, కార్మికులు కలిపి 2,500 మంది ఇప్పటివరకు పనిచేశారు. కిన్నెరసాని జలాశయం ఆధారంగా సమీపంలోని కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల సింగరేణి బొగ్గు సరఫరా చేసుకుని ఐదున్నర దశాబ్దాల పాటు ఏకధాటిగా ఉత్పత్తి  అందించింది.

జపాన్‌ టెక్నాలజీతో 1,2,3,4 యూనిట్లలో 240 మెగావాట్లు, 5, 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 7,8 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల ఉత్పత్తిని అందించింది. అయితే కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ యూనిట్లను మూసివేయాలని సెంట్రల్‌ ఎలక్రి్టసిటీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, దాని స్థానంలో సూపర్‌ క్రిటికట్‌ టెక్నాలజీతో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా మరో ప్లాంట్‌ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఓఅండ్‌ఎం కర్మాగారాన్ని 2019 డిసెంబర్‌ 31న మూసి వేయాల్సి ఉండగా.. 7వ దశలో వార్షిక మరమ్మతుల నేపథ్యంలో గత నవంబర్‌ 28వ తేదిన ఉత్పత్తిని నిలిపివేశారు. మరమ్మతు చేయడానికి నాలుగు నెలల కాలం తీసుకున్నారు. దీంతో డిసెంబర్‌ 31న మూసివేయాల్సిన ఓఅండ్‌ఎం కర్మాగారాన్ని మార్చి 31 వరకు పొడిగించారు.

మార్చి 31తో మూసేస్తాం
కాలం చెల్లిన 720 మెగావాట్ల కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం కర్మాగారాన్ని మార్చి 31న మూసివేయాలని జెన్‌కో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఐదున్నర దశాబ్దాల పాటు తన ప్రస్థానాన్ని సాగించి ఉమ్మడి రాష్ట్రంలో వెలుగులు అందించింది. జ పాన్‌ టెక్నాలజీతో నిర్మించిన ఈ కర్మాగారం ఇంతకాలం విజయవంతంగా ఉత్పత్తి అందించడం గొప్ప విషయం. కేటీపీఎస్‌తోనే పాల్వంచకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేకత ఉందనడంలో సందేహం లేదు. మూసివేత నిర్ణయం బాధాకరమైనప్పటికీ తప్పని పరిస్థితుల్లో విరామం ప్రకటిస్తున్నాం.జె.సమ్మయ్య, సీఈ

మరిన్ని వార్తలు