ఫోర్బ్స్‌ జాబితాలో హైదరాబాద్‌ యువకులు

3 Apr, 2020 03:07 IST|Sakshi

అభినందించిన మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఫోర్బ్స్‌ తాజాగా ప్రకటించిన ‘30 అండర్‌ 30’ఆసియా జాబితాలో చోటు సంపాదించుకున్న ఐదుగురు హైదరాబాద్‌ యువకులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం అభినందించారు. ఆసియా ఖండం వ్యాప్తంగా 30 ఏళ్ల లోపు వయసున్న 30 మందిని ఫోర్బ్స్‌ గుర్తించగా.. ఈ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువ పారిశ్రామికవేత్తలకు చోటుదక్కింది. ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించిన ప్రేమ్‌ కుమార్‌ (మారుత్‌ డ్రోన్స్‌), అశ్విన్‌ మోచర్ల (దీ థిక్‌ షేక్‌ ఫ్యాక్టరీ), సందీప్‌ బొమ్మి (యాడ్‌ ఆన్‌ మో), విహారి (అర్బన్‌ కిసాన్‌), పవన్‌ కుమార్‌ చందన (స్కై రూట్‌ ఏరోస్పేస్‌) పేర్లతో స్టార్టప్‌లను స్థాపించారు.

ప్రస్తుత తరంలోని యువకులు తమ ఆలోచనలకు అనుగుణంగా అద్భుతమైన ఆవిష్కరణలు, వినూత్న మార్గాల్లో పురోగమిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాయసహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్, వీ హబ్‌ వంటి కార్యక్రమాల ద్వారా హైదరాబాద్‌ నగర స్టార్టప్‌ వాతావరణం బలోపేతమైందని పేర్కొన్నారు. కాగా ఈ ఐదుగురు పారిశ్రామికవేత్తలు ఆయా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపారు. అలాగే వీరు స్థాపించిన కంపెనీలకు ఫండింగ్‌తో పాటు అనేక అవార్డులు కూడా లభించాయి. ఇందులో పలు స్టార్టప్‌లు టీ హబ్‌ ద్వారా ప్రారంభమవ్వడం లేదా టీ హబ్‌ ద్వారా సహాయ సహకారాలు అందుకున్నవి కావడం గమనార్హం. 

>
మరిన్ని వార్తలు