అభిషేక్‌కు అభినందనలు!

19 Feb, 2019 02:11 IST|Sakshi
అభిషేక్‌కు చెక్కును అందజేస్తున్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తే యంత్రాన్ని కనుగొన్న బాలుడు 

జాతీయ స్థాయిలో మూడో బహుమతి 

రూ.1.16 లక్షల ప్రోత్సాహకం అందించిన కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యాన్ని బస్తాల్లో నింపేందుకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి చలించి 9వ తరగతి విద్యార్థి చేసిన ఓ అద్భుత ఆవిష్కరణ జాతీయ స్థాయి బహుమతి సాధించింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అభిషేక్‌ ఈ ఆవిష్కరణ చేశాడు. అభిషేక్‌ తయారు చేసిన యంత్రానికి రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ఫెయిర్‌లో ప్రథమ బహుమతి వచ్చింది. జాతీయ స్థాయిలో మూడో బహుమతి సాధించింది. అభిషేక్‌ను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. సోమవారం అభిషేక్‌ తన ఉపాధ్యాయులతో పాటు కేటీఆర్‌ను కలిశారు.

చిన్న వయసులో ధాన్యం ఎత్తే యంత్రాన్ని తయారు చేయాలన్న ఆకాంక్ష ఎలా మొదలైందని కేటీఆర్‌ ఆ బాలుడిని అడిగి తెలుసుకున్నారు. తనది వ్యవసాయ కుటుంబమని తల్లిదండ్రులు ధాన్యాన్ని ఎత్తేందుకు మరో నలుగురితో కలసి పడుతున్న కష్టం తనకు ఈ పరికరాన్ని తయారు చేసేందుకు స్ఫూర్తి కలిగించిందని అభిషేక్‌ తెలిపాడు. జాతీయ స్థాయిలో బహుమతి అందుకున్నందుకు అభిషేక్‌ను కేటీఆర్‌ అభినందించారు. భవిష్యత్తులో ఏమవుతావని కేటీఆర్‌ అడగగా.. ఐఏఎస్‌ కావాలన్న ఆకాంక్ష తనకుందని అభిషేక్‌ చెప్పాడు.

ఇందుకు అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తానని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. అభిషేక్‌ తన యంత్రానికి పేటెంట్‌ పొందేందుకు, భవిష్యత్తులో మరిన్ని అవిష్కరణలు చేసేందుకు, తన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని కేటీఆర్‌ తెలిపారు. తన తరఫున ప్రోత్సాహకంగా రూ.1.16 లక్షల చెక్కును అభిషేక్‌కు అందించారు.

మరిన్ని వార్తలు