విమానయాన రంగానికి ఉజ్వల భవిష్యత్తు

13 Mar, 2020 04:34 IST|Sakshi
హైదరాబాద్‌ ఏర్పాటు చేసిన పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం కాక్‌పిట్‌లో మంత్రి కేటీఆర్‌

భాగస్వామ్య పెట్టుబడులతో విమానయాన రంగం బలోపేతం

ఫ్లైట్‌ సిమ్యులేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో పౌర విమానయాన రంగం తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులకు లోనవుతున్నా ఈ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. భాగస్వామ్య పెట్టుబడులతో విమానయాన రంగం బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ), యూరోపియన్‌ ఏవియేషన్‌ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్‌ఏ) సహకారంతో ఫ్లైట్‌ సిమ్యులేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎస్‌టీసీ) హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక పైలట్‌ శిక్షణ కేంద్రాన్ని కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఎనిమిది విమానాలు నిలిపే సామర్థ్యమున్న (8–బే) పైలట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఇప్పటికే ఏ–320 నియో, బాంబార్డియర్‌ డాష్‌–8, ఏటీఆర్‌ 72–600 సిమ్యులేటర్లను హైదరాబాద్‌ బేలో ఏర్పాటు చేయగా ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్‌లోనూ ఇప్పటికే మరో ఐదు సిమ్యులేటర్లను ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిందన్నారు. గురుగ్రాం, హైదరాబాద్‌లో ఏర్పాటైన ఎఫ్‌ఎస్‌టీసీ శిక్ష ణ కేంద్రాల ద్వారా పైలట్లకు అత్యాధునిక శిక్షణ సాధ్యమవుతుందన్నారు. స్వల్ప వ్యవధిలో తక్కువ ఖర్చుతో అత్యాధునిక శిక్షణ లభిస్తుండటంతో ఆగ్నేయాసియా దేశాలకు చెందిన వైమానిక సంస్థలతోపాటు దేశీయ సంస్థలు కూడా భారత్‌లో శిక్షణ భాగస్వాములుగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నాయ న్నారు. ఎఫ్‌ఎస్‌టీసీని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్‌ సిమ్యులేటర్‌ను కాసేపు సరదాగా నడిపారు.

2011లో ఎఫ్‌ఎస్‌టీసీ ప్రస్థానం ప్రారంభం... 
వైమానిక రంగంలో ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఏర్పాటైన ఎఫ్‌ఎస్‌టీసీ 2012లో ఎయిర్‌బస్‌ ఏ– 320, బోయింగ్‌ బి–737 సిమ్యులేటర్లను అందుబాటులోకి తెచ్చింది. కార్యకలాపాలను విస్తరించుకుంటూ 2015లో యూరోపియన్‌ ఏవియేషన్‌ సేఫ్టీ ఏజెన్సీ గుర్తింపు కూడా పొందింది. 2018లో హైదరాబాద్‌ శిక్షణ కేంద్రాన్ని శంకుస్థాపన చేయడంతోపాటు గుజరాత్‌ ఫ్లయింగ్‌ క్లబ్‌ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఇప్పటికే 1,100 మందికి శిక్షణ ఇచ్చిన ఎఫ్‌ఎస్‌టీసీ... హైదరాబాద్‌ శిక్షణా కేంద్రం ద్వారా దక్షిణాదిలో పైలట్ల శిక్షణ అవసరాలను తీరుస్తుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు