కరీంనగర్‌ ఐటీ టవర్‌ ప్రారంభించనున్న కేటీఆర్‌

10 Feb, 2020 15:30 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ ఐటీ టవర్‌ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌.. ఐటీ టవర్‌ను ప్రారంభిస్తారని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఉద్యోగావకాశాలు పెంచుతారనే నమ్మకం ఉన్న కంపెనీలకే ఈ ఐటీ టవర్‌లో అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే జిల్లాలో ఐటీ టవర్‌ను నిర్మించామన్నారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగితో పోలిస్తే కరీంనగర్‌ ఐటీ ఉద్యోగికి రూ.30 వేలు జీవన వ్యయం ఆదా అవుతుందన్నారు. కరీంనగర్‌ వాళ్లకే 80 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. మొత్తం 3000 నుంచి 3600 మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుందని తెలిపారు. తొలి రోజునే దాదాపు 400 మంది ఉద్యోగులు కరీంనగర్‌ ఐటీ టవర్‌లో పని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

కేసీఆర్‌ ఉండగా.. గల్ఫ్‌ ఎందుకు దండగ
ఐటీ టవర్‌వల్ల మల్టీ నేషనల్‌ కంపెనీలు జిల్లాకు తరలివస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 26 కంపెనీలు మమ్మల్ని సంప్రదించాయని, 15 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. హై ఫ్రీక్వెన్సీ ఇంటర్‌నెట్‌, నిరంతర విద్యుత్‌, పవర్‌ బ్యాక్‌ అప్‌ జనరేటర్‌ సెంట్రలైజ్డ్‌ ఏసీ వంటి అధునాతన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కంపెనీలకు ఇన్సెంటివ్‌లు ఇస్తున్నామన్నారు. మరో టవర్‌ కోసం 3 ఎకరాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు. ‘కేసీఆర్‌ ఉండగా.. గల్ఫ్‌ ఎందుకు దండగ’ అన్న నినాదంతో పని చేస్తున్నామని గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. (ఎక్కడ కన్నీళ్లు ఉంటే అక్కడ నేనుంటా..!)

మరిన్ని వార్తలు