మంచి మనసు చాటుకున్న కేటీఆర్‌

7 Nov, 2018 17:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దీపావళి పండుగ రోజు మంత్రి కేటీఆర్ చిన్నారుల పట్ల మంచి మనసు చాటుకున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ ఎన్జీవోకు చెందిన చిన్నారులకు 12 లక్షల రూపాయల చెక్కును కేటీఆర్ విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలకు స్వీట్లు, పటాకులు పంచి.. వాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. పండగ వేళ చిన్నారులతో ఇలా గడపడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వారితో గడిపిన ఫొటోలను ట్వీట్‌ చేశారు.

‘చాలా కాలం తర్వాత ఇది నాకు ఓ గొప్ప దీపావళి. హెల్పింగ్‌ హ్యాండ్స్‌ హ్యుమానిటీకి చెందిన అందమైన చిన్నారులతో కొద్దిసేపు గడిపాను. నా తరఫు నుంచి వాళ్లకు సహాయం చేస్తానని హామీ ఇచ్చాను. వారి ప్రాథమిక అవసరాల కోసం రూ.12లక్షల చెక్కు ఇచ్చాను. దయచేసి మీరు కూడా సహాయం చెయ్యండి’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

హెల్పింగ్‌ హ్యాండ్స్‌ హ్యూమానిటీ పేరుతో ఓ వ్యక్తి నిరాశ్రయులైన చిన్నారులను చేరదీసి వారికి అండగా నిలబడ్డాడు. చాలా కాలంగా పిల్లల బాగోగులు చూసుకుంటున్న ఆ వ్యక్తికి ఇటీవల కాలంలో నిధుల కొరత తలెత్తడంతో వారి పోషణ భారంగా మారింది. దీంతో ఆ పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యలను ఓ నెటిజన్‌ ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించి దీపావళి పండుగను వారితో జరుపుకొని మరి సాయం చేశారు. 

మరిన్ని వార్తలు