ఈ చట్టాలు మార్చాలి : కేటీఆర్‌

6 Dec, 2019 01:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అందరిలాగే ‘దిశ’ ఘటనలో తనకు భావోద్వేగాలున్నాయని.. అయితే చట్టపరంగానే దోషులకు శిక్ష పడుతుందని పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజలు సంయమనంతో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. గురువారం ఎంసీహెచ్‌ఆర్డీలో సివిల్‌ సర్వీసెస్‌ 94 ఫౌండేషన్‌ అధికారుల వీడ్కోలు సమావేశంలో ముఖ్య అతిథిగా కేటీఆర్‌ పాల్గొన్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న అధికారులకు ఆయన ధ్రువపత్రాలు అందజేశారు.

దిశ కేసులో దోషులకు త్వరగా శిక్ష పడేలా చూస్తామని స్పష్టంచేశారు. ‘హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం, హత్య ఘటన చాలా దారుణం. దీనిపై తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇటు నిందితులను ఉరితీయాలని ఎంపీలు పార్లమెంటు వేదికగా నినదించారు. అందరి కోపం, ఉద్వేగమంతా న్యాయబద్ధమైనవే. ఢిల్లీలో 2012లో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ కేసులో 7 ఏళ్లుగా విచారణ సాగినా.. ఇప్పటివరకు నిందితులను ఉరితీయలేదు.

ఇటు దేశంలోనే అతిపెద్ద ఉగ్రవాద చర్యకు పాల్పడిన అజ్మల్‌ కసబ్‌ను ఉరితీయడానికి ఎంత సమయం పట్టిందో అందరికీ తెలుసు. దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నా, ప్రస్తుత చట్టాలు అందుకు తగిన విధంగా లేవు. చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. నాకూ నలుగురు నిందితులను తుదముట్టించాలని ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రజలు కోరినట్లు వారిని ఉరితీయలేం. వాస్తవాలను గ్రహించి, రాజ్యాంగబద్ధంగా నియమ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది’అని చెప్పారు. 

చిత్తశుద్ధితో పనిచేయాలి.. 
సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని కేటీఆర్‌ సూచించారు. సమస్యల పట్ల వేగంగా స్పందించే గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు ప్రజలతో మమేకం కావాలన్నారు. రాజకీయాల్లోకి రాకముందు తానొక ప్రైవేట్‌ ఉద్యోగినని గుర్తుచేసుకున్నారు. 70 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో వేలాది గ్రామాల్లో తాగునీరు, కరెంటు, రోడ్ల సౌకర్యం లేదన్నారు. అయినా వందలాది ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తున్న భారత్‌ను మరోవైపు నుంచీ చూడాలని చెప్పారు.   

>
మరిన్ని వార్తలు