ఎడారిలో బందీ

9 May, 2019 04:01 IST|Sakshi

సౌదీ అరేబియాలో కరీంనగర్‌ వాసి వీరయ్య దీనగాథ 

తల్లి అంత్యక్రియలకు పంపాలని అడిగితే చిత్రహింసలు 

ఆవేదనను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వీరయ్య 

అక్కడి పోలీసులకూ ఫిర్యాదు.. దీంతో పళ్లూడేలా కొట్టిన షేక్‌ 

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో 

స్పందించిన కేటీఆర్‌.. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు వినతి 

సౌదీలోని భారత రాయబార అధికారులతో మాట్లాడిన కేంద్ర మంత్రి 

అల్గునూర్‌: ఉన్న ఊరిలో ఉపాధి కరువై గల్ఫ్‌ బాట పట్టిన కరీంనగర్‌ వాసి ఒకరు దేశం కాని దేశంలో బందీగామారి నరకయాతన అనుభవిస్తున్నాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం మక్తపల్లి గ్రామానికి చెందిన పాలేటి వీరయ్య ఏజెంట్‌ చేసిన మోసం.. యజమాని (కఫిల్‌) కర్కశత్వంతో సౌదీలో బందీ అయ్యాడు. వీరయ్యకు భార్య, ఇద్దరు కుమా రులున్నారు. స్థానికంగా సరైన ఉపాధి లేకపోవడం తో భార్య, బిడ్డలను వదిలి గల్ఫ్‌ వెళ్లాడు. రెండేళ్లుగా యజమాని చెప్పిన పనులు చేస్తున్నాడు.

అయితే.. ఇటీవల వీరయ్య తల్లి చనిపోయింది. దీంతో ఊరికి వెళ్తానని బతిమాలుకున్నా షేక్‌ పంపించలేదు సరికదా వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో బాధితుడు తన ఆవేదనను.. అక్కడ పడుతున్నకష్టాలను సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచానికి వెల్లడించాడు. ఉపాధి నిమిత్తం గతంలో ఖతార్‌ వెళ్లిన వీరయ్య.. రెండేళ్ల తర్వాత స్వదేశానికి వచ్చాడు. తర్వాత కూడా సొంతూల్లో పనేమీ దొరక్కపోవడంతో సుమారు రూ.1.50 లక్షలు అప్పు చేసి రెండేళ్ల క్రితం మళ్లీ గల్ఫ్‌ ఏజెంట్‌ యాదగిరి ద్వారా చిగురుమామిడికి చెందిన తిరుపతితో కలిసి సౌదీ అరేబియా వెళ్లాడు. 

వ్యవసాయం అని చెప్పిన ఏజెంట్‌ 
వీరయ్య, తిరుపతి గల్ఫ్‌ వెళ్లేందుకు చిగురుమామిడి మండలం ఓగులాపూర్‌కు చెందిన ఏజెంట్‌ యాదగిరిని సంప్రదించారు. దీంతో ఆయన పని ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. సౌదీ అరేబియాలో ఖర్జూర తోట లు చూసుకోవాలని తెలిపాడు. దీనికి అంగీకరించిన వీరిద్దరి వద్ద రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. రెండేళ్ల క్రితం తనతోపాటు ఇద్దరినీ సౌదీకి తీసుకెళ్లాడు. అక్కడకి వెళ్లిన తర్వాత షేక్‌ ఇద్దరినీ అబుదాబికీ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖాకా ప్రాంతంలో సుమా రు వంద ఒంటెలకు కాపలా ఉండాలని, వాటి బాగోగులు చూసుకోవాలని ఆదేశించారు.

ఇందుకు నెలకు రూ.20 వేలు ఇస్తానని చెప్పాడు. లక్షన్నర అప్పు చేసి సౌదీ వెళ్లిన ఇద్దరూ ఇండియాకు తిరిగి రాలేక షేక్‌ చెప్పిన పనికి అంగీకరించారు. రెండేళ్లుగా ఒంటెల బాగోగులు చూసుకుంటున్నారు. షేక్‌ ఎప్పుడు టిఫి న్‌ పంపిస్తే అప్పుడే తింటుండేవారు. ఎంత కష్టమైనా వీసా గడువు ముగిసేవరకు పని చేయాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ కూడా బాగానే ఉంటున్నామని చెప్పేవారు. 

తల్లికి కొరివిపెట్టేందుకు రాలేక.. 
వీరయ్య తల్లి వీరమ్మ 45 రోజుల క్రితం స్వగ్రామం మక్తపల్లిలో చనిపోయింది. కుటుంబసభ్యులు ఫోన్‌ లో వీరయ్యకు సమాచారం అందించారు. ఇదే విషయాన్ని వీరయ్య తన షేక్‌కు వెళ్లి చెప్పాడు. తన తల్లికి తలకొరివి పెట్టాలని, ఇండియా పంపించాలని వేడుకున్నాడు. షేక్‌ మాత్రం ఇందుకు ససేమిరా అన్నా డు. దీంతో వీరయ్య తల్లి కోసం ఇండియా వెళ్లాలని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వీసా గడువు కూడా దగ్గర పడుతుందని తెలిపాడు.

తనను షేక్‌ ఇంటికి పంపించడంలేదని తన ఆవేదనను ఫోన్‌ లో సెల్ఫీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. వీరయ్య వస్తాడని కుటుంబ సభ్యులు రెండు రోజులు వీరమ్మకు అంత్యక్రియలు నిర్వహించకుం డా ఎదురు చూశారు. సోషల్‌ మీడియాలో వీడియో చూసిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు షేక్‌ను పిలిపించి ఇండియా పంపాలని సూచించారు. పది రోజుల్లో పంపిస్తానని ఆ షేక్‌ పోలీసుల ముందు అంగీకరించాడు.  

ఒంటె చనిపోయిందని దాడి 
పోలీసులకు ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకే వీరయ్య కాపలా ఉండేచోట ఓ ఒంటె చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న షేక్‌ వీరయ్యపై దాడి చేశాడు. ఒంటె నిర్లక్ష్యంతోనే చనిపోయిందని పళ్లు రాలిపోయేంతలా తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని కూడా వీరయ్య తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తనను ఇండియా పంపేందుకు షేక్‌ అంగీకరించడంలేదని, ఒంటె చనిపోతే తనపై దాడి చేశాడని అం దులో తెలిపాడు. వీరయ్య సెల్ఫీ వీడియో విషయం తెలవడంతో ఆగ్రహించిన షేక్‌ వెంటనే వీరయ్య సెల్‌ఫోన్‌ లాక్కున్నాడు.

ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు. దీంతో నెల రోజులుగా కుటుంబ సభ్యులతో కూడా వీరయ్య మాట్లాడడంలేదు. ఈ క్రమంలో వీరయ్య గతంలో సోషల్‌ మీడియాలో చేసిన సెల్ఫీ వీడియో పోస్టు ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. వీరయ్యను కాపాడాలంటూ.. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. 

స్పందించిన కేంద్ర మంత్రి 
మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీరయ్య వీడియో చూసిన పలువురు దానిని షేర్‌ చేయడంతో ఈ విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వెళ్లింది. అధికారులు వీరయ్య కుటుంబం గురించి తెలుసుకుని కొడుకు హరీశ్‌కు ఫోన్‌ చేశారు. వివరాలు తెలుసుకున్నారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా సౌదీలోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. వీరయ్యను స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భారత దౌత్య కార్యాలయం అధికారులు బాధితుడితో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ.. వీరయ్యనుంచి స్పందన రాలేదు. కాగా.. వీరయ్య ఆచూకీ కనుక్కునేందుకు సహకరించాలని సౌదీలోని ఎన్నారైలకు మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

మా నాన్నను తీసుకురండి.. ప్లీజ్‌! 
మా నాన్న ఏజెంట్‌ను నమ్మి సౌదీఅరేబియా వెళ్లాడు. వీసా గడువు కూడా రెండేళ్లే. గడువు ముగిసి ఇప్పటికే నెల రోజులైంది. అయినా ఇండియాకు పంపేందుకు షేక్‌ నిరాకరిస్తున్నాడు. ఈ విషయాన్ని తిరుపతి ఫోన్‌ నుంచి మాకు ఫోన్‌ చేసి చెప్పాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మా నాన్నను ఎలాగైనా ఇండియాకు క్షేమంగా తీసుకురావాలి. నెల రోజులుగా మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎలా ఉన్నాడో తెలియదు. రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. 
– హరీశ్, వీరయ్య కొడుకు, మక్తపల్లి 

>
మరిన్ని వార్తలు