వైద్య పరికరాల దిగుమతులకు చెక్‌ పెట్టాలి

20 Feb, 2020 03:24 IST|Sakshi
బయో ఆసియా ముగింపు సదస్సులో వివిధ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్‌

మెడికల్‌ డివైజెస్‌ పార్కుతోనే అది సాధ్యం: కేటీఆర్‌ 

ఘనంగా ముగిసిన బయో ఆసియా సదస్సు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఉపయోగించే వైద్య పరికరాల్లో 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఈ పరిస్థితి మారాలని మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా వైద్య పరికరాల తయారీకి పెద్దపీట వేయాలని, వైద్య పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తమ ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందడుగు వేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆసియన్‌ బయోటెక్‌ అసోసియేషన్స్‌ (ఫాబా) సంయుక్తంగా నిర్వహించిన బయో ఆసియా సదస్సు బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై వైద్య పరికరాల తయారీ కేంద్రంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలకు భూ కేటాయింపు పత్రాలను అందజేశారు. ఐబీఎం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. బయో ఆసియా వంటి సదస్సులు ప్రభుత్వాలకు, పరిశ్రమలకు ఎన్నో గొప్ప అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు.  17వ బయో ఆసియా సదస్సుకు 35 దేశాల నుంచి 2,000 మంది హాజరయ్యారని, వచ్చే ఏడాది ఈ సదస్సు మరింత విస్తృత స్థాయిలో నిర్వహించాలన్నది తమ ఆకాంక్ష అని చెప్పారు. 

స్టార్టప్‌ కంపెనీలకు అవార్డులు...  
బయో ఆసియాలో భాగంగా స్టార్టప్‌ కంపెనీల పోటీల్లో విజేతలుగా నిలిచిన ఐదు కంపెనీలకు కేటీఆర్‌ నగదు బహుమతులు అందజేశారు. పోటీ కోసం వందల దరఖాస్తులు రాగా నిశిత పరిశీలన తరువాత 70 కంపెనీలకు బయో ఆసియాలో తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించామని, సీసీఎంబీ, టెక్‌ మహేంద్ర వంటి సంస్థల నుంచి ఎంపిక చేసిన న్యాయనిర్ణేతలు 5 కంపెనీల ను విజేతలుగా నిర్ణయించారని ఐఐఐటీ ప్రొఫెసర్‌ రమేశ్‌ లోకనాథన్‌ తెలిపారు. నవజాత శిశువులకు వచ్చే కామెర్ల రోగానికి చికిత్స అందించే పరికరాన్ని అభివృద్ధి చేసిన ‘హీమ్యాక్‌ హెల్త్‌ కేర్‌’, డాక్టర్ల అపాయింట్‌మెంట్లు మొదలు, వారి లభ్యత, ప్రత్యేకతల గురించి టెలిఫోన్‌లో వివరించేందుకు వాడే కృత్రిమ మేధ ఆధారిత సేవలను అందిస్తున్న ‘కాల్‌జీ’, ఆధునిక టెక్నాలజీతో పనిచేసే ఊతపు కర్రలు (క్రచెస్‌)ను తయారు చేసిన ‘ఫ్లెక్సీ మోటివ్స్‌’, శరీర అవయవాల త్రీడీ మోడళ్ల ద్వారా గాయాలు, శస్త్రచికిత్సల నుంచి కోలుకునే సమయాన్ని సగానికి తగ్గించే ‘లైకాన్‌ త్రీడీ’, ఈ–కోలీ బ్యాక్టీరియాలో మార్పుల ద్వారా మందుల తయారీకి అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేయగల ‘ఆంకోసెమిస్‌’కు ఈ అవార్డులు లభించాయి. 

మరిన్ని వార్తలు