సంక్షేమంలో నంబర్‌ వన్‌

1 Dec, 2019 02:50 IST|Sakshi
బాన్సువాడలో చార్జింగ్‌ ఆటోను నడిపిస్తున్న మంత్రి కేటీఆర్‌

కేసీఆర్‌ పాలన పట్ల ఆకర్షితులైన జనం  

బాన్సువాడ సభలో మంత్రి కేటీఆర్‌ 

బాన్సువాడ: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రూ.100 కోట్లతో జరిగిన పలు అభివృద్ధి పనులను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో అణగారిన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ పాలన పట్ల ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారని, అందుకే అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తక్కువ సంఖ్యకే పరిమితమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధించినట్లే ఫ్లెక్సీ కల్చర్‌ను కూడా నిర్మూలిద్దామని మంత్రి పిలుపునిచ్చారు.  

పాపను పలకరించి.. రూ.2 వేలు ఇచ్చి.. 
కేటీఆర్‌ బాన్సువాడలోని మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించి చార్జింగ్‌ ఆటోలో పోచమ్మగల్లి మీదుగా వెళ్తుండగా, అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడిన మహిళలను చూసి ఆగారు. ఒక మహిళ పాపను ఎత్తుకొని ఉండగా, ఆ పాపను పలకరించి బాగున్నావా అంటూ మాట్లాడారు. బాగా చదవాలని వెన్ను తట్టి రూ.2 వేల నగదును అందజేశారు. 

స్పీకర్‌గా ఆదేశిస్తున్నా.. 
బాన్సువాడలోని వీక్లీ మార్కెట్‌లో మున్సిపల్‌ భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని స్పీకర్‌గా ఆదేశిస్తున్నానని పోచారం మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. స్పందించిన కేటీఆర్‌.. స్పీకర్‌ కోరినన్ని నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు