మున్సిపాలిటీ ఎన్నికల్లో టికెట్‌ దొరకనివారికి కేటీఆర్‌ హామీ

30 Dec, 2019 21:16 IST|Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల: మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జిల్లాలో ప్రచారం చేపట్టారు. సోమవారం సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్‌ హాల్‌లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉ‍న్న అన్ని మున్సిపాలిటీలను గెలిపించాల్సిన బాధ్యత మున్సిపల్‌ శాఖ మంత్రిగా తనపైన ఉందన్నారు. టికెట్‌ రాని అభ్యర్థులు నిరుత్సాహపడకుండా, బిఫామ్‌లు వచ్చిన అభ్యర్థి వెంట ఉండి గెలిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బి ఫామ్‌ రాని అభ్యర్థులకు రానున్న రోజుల్లో మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. వారి కోసం నామినేటెడ్‌ పోస్టులను కేటాయిస్తామని స్పష్టం చేశారు.

కొత్తగా వచ్చిన మున్సిపల్‌ చట్టం ప్రకారం గెలిచిన అభ్యర్థులను కూడా తొలగించే జీవో ఉందని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. కాబట్టి ప్రతి అభ్యర్థి ప్రజల కోసం పని చేసి అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ జయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వేసే ప్రతి ఒక్క ఓటు కూడా సీఎం కేసీఆర్‌కు వేస్తున్నట్టుగా భావించి, టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చదవండి: కేటీఆర్‌.. సినిమాల్లో నటిస్తారా?

మరిన్ని వార్తలు