కొత్త మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ తెస్తాం

23 Sep, 2019 03:19 IST|Sakshi

ఆస్తి పన్ను రేషనలైజేషన్,రూమ్‌ రెంటల్‌ సవరణకు చర్యలు

శాసనమండలిలో మున్సిపల్‌ బిల్లుపై కేటీఆర్‌ స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా ఏర్పడిన 68 మన్సిపాలిటీల్లో లేఔట్ల క్రమబద్ధీకరణకు లేఔట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) తీసుకొస్తామని, ఆయా మున్సిపాలిటీల్లో ఆదాయం పెంచుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్, ఇతర అంశాలను పరిశీలిస్తున్నట్టు మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఆస్తి పన్ను హేతుబద్ధీకరణతో పాటు ‘రూం రెంటల్‌ విధానాన్ని’ సవరించేందుకు చర్య లు తీసుకుంటామన్నారు. శాసనమండలిలో ఐదు సవరణలతో ప్రవేశపెట్టిన మున్సిపల్‌ బిల్లును గురించి సభ్యులకు మంత్రి వివరించారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానమున్నా మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీకి అర్హులేనని కేటీఆర్‌ తెలిపారు.

ఈ మేరకు బిల్లులో సవరణ చేసినట్టు ఆనాటి పద్ధతుల ప్రకారం గతంలో తెచ్చిన నిబంధనను కావాలనే తాము మార్చామని, ఈ నిర్ణయాన్ని అనాలోచితంగా తీసుకురాలేదని స్పష్ట్టం చేశారు. దీనిపై పునరాలోచించి, ఇద్దరు పిల్లల పరిమితిని కొనసాగించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. ఈ బిల్లుపై అనుమానాలున్నాయని, కలెక్టర్లకు అధికంగా అధికారాలు కట్టబెట్టడం సరికాదన్నారు.  

అర్థం చేసుకుని బరిలో దిగాలి 
కొత్తగా తీసుకొచ్చిన మున్సిపల్‌ బిల్లులో అనేక కఠిన నిబంధనలు, తొలగింపుతో పాటు ఇతర చర్యలు తీసుకునే అవకాశమున్నందున ఎన్నికల్లో పోటీ చేసే వారు వాటిని జాగ్రత్తగా చదవుకుని బరిలో దిగాలని కేటీఆర్‌ సూచించారు. తప్పు చేసిన ప్రజాప్రతినిధులను తొలగించే పనిని మొదలుపెట్టేపుడు ముందుగా టీఆర్‌ఎస్‌ వారి నుంచే మొదలుపెడతామన్నారు.  
 
వాటి తొలగింపునకు సహకరించాలి.. 
ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై ఏర్పాటు చేసిన ప్రార్థనా మందిరాలు, ప్రముఖ నేతల విగ్రహాలను తొలగించే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తే పని సులువవుతుందని కేటీఆర్‌ చెప్పారు. మతం అనేది సున్నితమైన అంశమైనందున హైదరాబాద్‌లో దీన్ని చేపట్టే విషయంలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్సీ, బీజేపీకి చెందిన హోంశాఖ సహాయ మంత్రి, ఎమ్మెల్సీ ముందుకొస్తే బావుంటుందన్నారు. తాము ఏ మున్సిపల్‌ కౌన్సిల్‌ను ముందుగా రద్దు చేయడం లేదని స్పష్టంచేశారు. ఈ చర్చలో సభ్యులు అమీనుల్‌ జాఫ్రీ, భానుప్రసాద్, ఉల్లోళ్ల గంగాధరగౌడ్, ఎన్‌.రామచంద్రరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి.జీవన్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, అటుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్‌ బిల్లుకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపినట్టు చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా