మున్సిపల్‌ పోరు: అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్‌

16 Jan, 2020 14:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌లో  ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం నిర్వహించాల్సిన తీరుపై అభ్యర్థులకు దిశానిర్ధేశం చేశారు. అదే విధంగా వివిధ పట్టణాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందించిందని, ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తే సరిపోతుందని కేటీఆర్‌ అన్నారు. ప్రభుత్వ పథకాలను అభ్యర్థులకు కేటీఆర్‌ వివరించారు. పెన్షన్ల నుంచి మొదలుకొని సాగునీటి ప్రాజెక్టుల దాకా కేసీఆర్‌ కిట్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌, జిల్లాల వికేంద్రీకరణ.. ఇలా అనేక కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సుమారు రూ. 45 వేల కోట్ల రుపాయలతో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, పట్టణాల కోసం ఇప్పటికే మిషన్‌ భగీరథలో భాగంగా బల్క్‌ వాటర్‌ను అందిస్తున్నామన్నారు.(ఎవరి సత్తా ఏంటో గల్లీలో తేలుతది)

పట్టణాల కోసం 3,75,000 వేల ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణాలకు ప్రత్యేక నిధులు, కార్పొరేషన్లకు బడ్జెట్‌లో నిధులు ఇస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దేనని పేర్కొన్నారు. ఇప్పటికే టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.25 వందల కోట్ల రూపాయలతో పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించామని అన్నారు. స్వచ్‌, హరిత పట్టణాల కోసం చెత్త తరలింపు ఆటోలు, ఇతర వాహనాలను సమకూర్చారని, ప్రతి పట్టణంలో నర్సరీ ఏర్పాటు చేయడంతోపాటు హరితహార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పోల్చితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పది రెట్లు ఎక్కువ నిధులను ఖర్చు చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనను.. టీఆర్‌ఎస్‌ పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయాలని ప్రజలను కోరాలని అభ్యర్థలకు సూచించారు. నూతన మున్సిపాలిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేసి ప్రజలకు మరింత పారదర్శక, వేగవంతమైన పౌర సేవలను అందిస్తామని తెలిపారు.(నన్ను చూసి.. వారికి ఓటేయండి: ఈటల)

కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు కూడా లేనిపరిస్థితి ఉందని ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎన్నికల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. పార్టీ బీ ఫారం కోసం ప్రయత్నం చేసిన తోటి నాయకులతో కలుపుకుని సమిష్టిగా ఐక్యంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని హితవు పలికారు. పార్టీ అభ్యర్థులు ఈ నాలుగు రోజుల్లో కనీసం మూడు నుంచి అయిదు సార్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని అందించి ఓట్లు అడగాలని సూచించారు. ప్రతి వార్డు, పట్టణాల అవసరాల మేరకు స్థానిక మేనిఫెస్టోను విడుదల చేయాలని, ఎన్నికలకు సంబంధించి కేంద్ర పార్టీ కార్యాలయం ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటుందని తెలిపారు. ప్రస్తుత స్థాయి నుంచి నివేదికల ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి పురపాలక ఎన్నికలలో విజయం తథ్యమన్నారు. ఫలితాల తర్వాత గెలిచిన అందరూ అభ్యర్థులతో మరోసారి సమావేశం అవుతానని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు