కేటీఆర్‌కు ఆరోజే చెప్పా : లగడపాటి

5 Dec, 2018 12:03 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై వ్యతిరేకత ఉందని గతంలో కేటీఆర్‌తో చెప్పా

కూటమి కట్టడంతో పోరు పోటాపోటీగా మారింది

37 స్థానాల ఫలితాలను కేటీఆర్‌తో పంచుకున్నా

మీడియాతో లగడపాటి రాజగోపాల్‌

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఇతరుల ఒత్తిడికి తలొగ్గి ఎన్నికల సర్వే ఫలితాలను మార్చారని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాను ఎవరి ప్రలోభాలకు గురికాలేదని, తన టీం చేసిన సర్వేనే తాను విడుదల చేస్తున్నానని ఆయన అన్నారు. లగడపాటి బుధవారం మీడియా సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తాను ఎప్పుడూ కేటీఆర్‌ను వ్యక్తిగతంగా కలవలేదని, ఈ ఏడాది నవంబర్‌ 11న ఆయనే తనకు మెసేజ్‌ పంపారని తెలిపారు. తన టీం చేస్తున్న సర్వే గురించి కేటీఆర్‌ తెలుసుకుని 20 నియోజకవర్గాల్లో సర్వే చేయమని ఆయన కోరినట్లు లగడపాటి వెల్లడించారు.

కేటీఆర్‌ మాట కాదనలేక తాను 37 స్థానాల్లో సర్వే చేయించానని, వాటిలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తున్నట్లు ఆయనతో చెప్పినట్లు లగడపాటి వెల్లడించారు. గతంలో తాను గజ్వేల్‌, సిద్ధిపేటలో పర్యటించినప్పుడు గజ్వేల్‌లో ఆయనకు(పేరు చెప్పడానికి లగడపాటి ఇష్టపడలేదు) కష్టంగా ఉందని అక్కడి పోలీసులే తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. మంగళవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల పేర్లను లగడపాటి వెల్లడించిన తరువాత ఆయనపై కేటీఆర్‌ ఫైర్‌ అయిన విషయం తెలిసిందే.

కేటీఆర్‌ వ్యాఖ్యలపై లగడపాటి వివరణ ఇస్తూ.. ‘‘నవంబర్‌ 16న మా బంధువుల ఇంట్లో ఆయనతో తొలిసారి భేటీ అయ్యాను. 37 స్థానాల ఫలితాలపై ఆయన విభేదించారు. అప్పటి నుంచి ఆయనతో నేను మాట్లాడలేదు. కూటమి ఏర్పడక ముందు మా టీం చేసిన సర్వేలో టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉంది. కానీ టీజేఎస్‌, సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్‌ కూటమిగా ఏర్పడ్డ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయిది. సిట్టింగ్‌ స్థానాల్లో కొంతమంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కూడా కేటీఆర్‌తో చెప్పాను. అభ్యర్థులను మార్చమని కూడా సలహా ఇచ్చాను. టీడీపీతో పొత్తుపెట్టుకోమని కేటీఆర్‌కు సలహా ఇచ్చాను. కానీ ఆయన మాకు అవసరం లేదన్నారు’’ 

‘‘రేవంత్‌ రెడ్డి, జగ్గారెడ్డి వంటివారిని అరెస్ట్‌ చేయించడం వల్ల మీకే నష్టం జరుగుతుందని కూడా కేటీఆర్‌కు చెప్పాను. పోటాపోటీ ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన పలు వాగ్ధానాలు డబుల్‌ బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూమి కేసీఆర్‌కు ప్రతికూలంగా మారాయి. తాజాగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది’’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు
ప్రజాఫ్రంట్‌ వైపే ప్రజానాడి..
బాబు ఒత్తిడితోనే ‘సర్వే’ మార్చారు​​​​​​​

>
మరిన్ని వార్తలు