తగిన సంఖ్యలో మహిళా సభ్యుల్లేకే..

30 Nov, 2017 02:36 IST|Sakshi

రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలు లేకపోవడంపై కేటీఆర్‌

రాజకీయ సర్దుబాట్లు కూడా కారణమే..

దీనిపై సీఎం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు

జీఈఎస్‌లో చర్చాగోష్టికి సమన్వయకర్తగా ఉండటం

గొప్ప అవకాశమని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ‘‘రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేని మాట వాస్తవమే. శాసనసభలో సరైన సంఖ్యలో మహిళా శాసనసభ్యులు లేకపోవడం దీనికి ప్రాథమిక కారణమని భావిస్తున్నా. రెండోది రాజకీయ సర్దుబాట్ల వల్ల కూడా సాధ్యం కాలేదు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌ కచ్చితంగా సరైన సమయంలో చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా..’’అని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ విషయం గురించి అడిగే ముందు రాష్ట్రంలో ఆరుగురు మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పారు.

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు టీఆర్‌ఎస్‌ గట్టిగా మద్దతు ఇస్తోందని.. మహిళా బిల్లుకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని తెలిపారు. పార్లమెంట్‌లో ఎప్పుడు బిల్లు పెట్టినా.. మద్దతిస్తామని తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. బుధవారం ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో ‘శ్రామిక శక్తి తయారీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణలో కొత్త పోకడలు’అనే అంశంపై చర్చకు మంత్రి కేటీఆర్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఇవాంకా ట్రంప్, చెర్రీ బ్లెయిర్, చందా కొచ్చర్, కరెన్‌ క్వింటోస్‌లతో చర్చాగోష్టి నిర్వహించారు. అనంతరం కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. ఇవాంకా ట్రంప్, చెర్రీ బ్లెయిర్‌ వంటి శక్తిమంతమైన మహిళలతో చర్చాగోష్టి నిర్వహించడం ద్వారా నేర్చుకోవడానికి ఎంతో లభించిందని, ఇది తనకు గొప్ప అవకాశమన్నారు. చర్చను వారే స్వయంగా నిర్వహించుకోగలరని, వేదికపై తన అవసరం లేకపోయినా తనకు అవకాశం కల్పించారని చెప్పారు. ఇలా ఎప్పుడూ చర్చాగోష్టికి సమన్వయకర్తగా వ్యవహరించలేదన్నారు.

మార్గనిర్దేశం చేశారు..
చర్చలో పాల్గొన్న మహిళలు తమ అభిప్రాయాలు, తీర్మానాలను బలంగా వ్యక్తం చేశారని కేటీఆర్‌ కొనియాడారు. మార్పును కోరుకుంటున్న ఈ మహిళలు తమను భవిష్యత్తు వైపునకు మార్గనిర్దేశం చేశారని చెప్పారు. చర్చలో మహిళల సామర్థ్యం, ఆత్మవిశ్వాసం, నైపుణ్యాభివృద్ధి, మార్గనిర్దేశకత్వం, పెట్టుబడులు, శ్రమశక్తి, ప్రైవేటు రంగంలో ప్రాతినిధ్యం తదితర అంశాలపై విస్తృతంగా మాట్లాడినట్లు తెలిపారు. ఇవాంకా ట్రంప్‌ చెప్పినట్లు శ్రమశక్తి విషయంలో మహిళల సమస్యలపై ప్రపంచ దేశాలు కలసి పనిచేయాల్సిన అవసరముందన్నారు. ఇందుకు అమెరికా ప్రభుత్వం ఇప్పటికే 14 దేశాలతో కలసి పనిచేస్తోందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యత అధికంగా ఉందని పేర్కొన్నారు.


నాలోనూ వివక్ష ఉంది
"రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలు, విధానాలు అమలు చేస్తున్నాం. అయినా అవి సరిపోవు. ఒక కుమార్తె, ఒక కుమారుడికి తండ్రిని. నా లోపల కూడా వివక్ష ఉందని ఈ చర్చ అనంతరం తెలుసుకున్నా... స్వేచ్ఛా ప్రపంచ ప్రతినిధిగా మాట్లాడిన ఇవాంకా కూడా మహిళగా తనలో పాతుకుపోయిన వివక్ష గురించి చెప్పారు. ప్రభుత్వాలు, సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించడానికి ముందు ఈ విషయంలో మనమందరం ఆత్మపరిశీలన జరుపుకోవాలి..’’      – కేటీఆర్‌

మరిన్ని వార్తలు