ఇంటింటికీ ఇంటర్నెట్‌ 

8 Jul, 2020 05:31 IST|Sakshi
సిరిసిల్ల జిల్లా రంగంపేటలో మహిళా రైతుకు భూమి పట్టా అందిస్తున్న మంత్రి కేటీఆర్‌

ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడి  

కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చాం

307 మంది గిరిజనులకు భూమి పట్టాలు పంపిణీ 

సిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్తంగా టీ–ఫైబర్‌ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో 307 మంది గిరిజన రైతులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీ–ఫైబర్‌ పనులు సాగుతున్నాయని, ఇంటింటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరి తహారం ద్వారా పెద్దఎత్తున మొక్కలు నాటుతూ భవిష్యత్‌ తరాలకు ఆక్సిజన్‌ అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అడవిని నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవర్నీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.  

న్యాయమైన వాటా వాడుకుంటున్నాం  
కృష్ణా, గోదావరి నదుల్లో న్యాయమైన నీటి వాటాను కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ద్వారా వాడుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. రైతులకు దీర్ఘకాలంగా మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశానికి రైతులే వెన్నెముక అని, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత కరెంటును అందిస్తున్నామని, పెట్టుబడి సాయం గా ఇంతటి కరోనా కష్టకాలంలో 57 లక్షల మంది రైతులకు రూ. 7,200 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతులకు బీమా కల్పించి ధీమా ఇస్తున్నామని, ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని గట్టిగా నమ్మే వ్యక్తి కేసీఆర్‌ అని మంత్రి పేర్కొన్నారు. దమ్మున్న, దక్షత ఉన్న, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కేసీఆర్‌ అని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి ఏం చేసినా రైతుల లాభం కోసమే తప్ప తన స్వప్రయోజనాల కోసం కాదన్నారు. అక్కరకొచ్చే పంటలు వేస్తే లాభదాయకం అవుతుందని కేసీఆర్‌ గట్టిగా నమ్ముతున్నారని, పంటల సాగులో మార్పు వచ్చిందన్నారు.  

పాలనా సౌలభ్యం కోసం.. 
రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా, 30 రెవెన్యూ డివిజన్లను 73 రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశామని కేటీఆర్‌ వివరించారు. 439 మండలాలు ఉండగా అదనంగా 131 మండలాలను కొత్తగా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 3,400 తండాలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 42 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు.

ఇకపై అభివృద్ధిపైనే దృష్టి  
వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవని, అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. రూ.15 కోట్ల వ్యయంతో వీర్నపల్లి మం డలం రాశిగుట్టతండా, మద్దిమల్ల, సోమారం పేట, వన్‌పల్లి, శాంతినగర్‌ వద్ద నిర్మించిన ఐదు వంతెనలను మంత్రి ప్రారంభించారు. కంచర్లలో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గర్జనపల్లిలో రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

>
మరిన్ని వార్తలు