డబుల్‌ ఇళ్లకు మరిన్ని సదుపాయాలు

2 Jul, 2018 10:14 IST|Sakshi
డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌ను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్, కార్పొరేటర్‌ మిత్రకృష్ణ, క్వార్టర్స్‌ను సందర్శిస్తున్న మంత్రి

జియాగూడ: జియాగూడలో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో మరిన్ని సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... జియాగూడలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు సకాలంలో లబ్ధిదారులకు అందజేయం జరుగుతుంందన్నారు. కాలనీవాసుల కోరిక మేరకు మరిన్ని సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానన్నారు. స్థానిక కార్పొరేటర్‌ మిత్రకృష్ణ ఇక్కడి పరిస్థితులను, కావాల్సిన సదుపాయాల గురించి మంత్రికి వివరించారు.

ముఖ్యంగా క్వార్టర్స్‌లోని కిచెన్‌ రూంలలో టైల్స్‌ వేయాలని, గేటెడ్‌ కమ్యూనిటీగా తీర్చిదిద్దాలని, ఇక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాలను హయ్యర్‌ స్టాండర్ట్‌ వరకు తీర్చిదిద్దాలని మంత్రిని కోరారు. అలాగే క్వార్టర్స్‌ మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో హెల్త్‌ సెంటర్‌ను నిర్మించకుండా పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని కోరారు. కాలనీ చుట్టూరా ప్రహారీ నిర్మించాలని సూచించారు. క్వార్టర్స్‌లో పలు చోట్ల ఖాళీ స్థలం ఉన్నందున అదనంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పనులను చేపట్టినట్లయితే నిరుపేదలకు మరికొందరికి లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, కాలనీ సంఘం అధ్యక్షులు ఈ. శ్రీనివాస్, వార్డు కమిటీ, ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు