‘లంచం అడిగితే తాట తీస్తాం..’

27 Feb, 2020 02:20 IST|Sakshi
జనగామలోని అంబేడ్కర్‌ నగర్‌లో ఓ వృద్ధురాలితో ముచ్చటిస్తున్న మంత్రి కేటీఆర్‌

కొత్త మున్సిపల్‌ చట్టం కఠినంగా అమలు: కేటీఆర్‌ 

ఏప్రిల్‌ నుంచి కొత్త పింఛన్లు 

విడతల వారీగా డబుల్‌ బెడ్రూం ఇళ్లు

పేదల కష్టాలు తెలుసుకోవడానికే దళితవాడకు వచ్చా..

జనగామ మునిసిపాలిటీలో మంత్రి ఆకస్మిక తనిఖీ 

సాక్షి, జనగామ: ‘లంచాలను అరికట్టడానికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త మున్సిపల్‌ చట్టం తీసుకొచ్చారు.. 600 గజాల లోపు ఇల్లు కట్టుకునే వారు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ఇస్తే అనుమతి పత్రాలు 21 రోజుల్లో మీ ఇంటికే వస్తాయి. ఎవరినీ అడగక్కరలేదు. ఎవరైనా లంచం అడిగితే తాట తీస్తాం’అని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు హెచ్చరించారు. పట్టణ ప్రగతిలో భాగంగా బుధవారం జనగామ మున్సిపాలిటీలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన ‘పట్టణ ప్రగతి’సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. çపట్టణాల్లోని నిరుపేదలకు విడతల వారీగా డబుల్‌ బెడ్రూం ఇళ్లను మంజూరు చేస్తామని, ఇళ్ల మంజూరు కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని, ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేది’కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారంగా పట్టణాల్లో నాటిన మొక్కల్లో 85% బతక్కపోతే కౌన్సిలర్, చైర్మన్‌ పోస్టులు ఊడుతాయని ఆయన హెచ్చరించారు. ఊరూ రా, పట్టణాల్లో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నామని, ఇళ్లు, కాలనీల్లో మొక్కలు పెంచాలని  కోరారు. 

పుట్టినప్పటి నుంచి కాటికిపోయే వరకు..
పుట్టినప్పటి నుంచి కాటికి పోయే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. పింఛన్లను రెట్టింపు, ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్‌ కిట్, ఆరోగ్య లక్ష్మి, హాస్టళ్లల్లో చదువుకునే పిల్లలకు సన్న బియ్యం, నాణ్యమైన విద్య అందిస్తున్నామని వివరించారు. ప్రజల మధ్యలో ఉండాలనే కేసీఆర్‌ మమ్మల్ని జనంలోకి పంపిస్తున్నారని, దళిత కాలనీల్లో పర్యటించాలని చెప్పారన్నారు. పేదల కష్టాలను తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చానన్నారు.

తడి, పొడి చెత్త సేకరణకు సహకరించాలి
తడి, పొడి చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరా రు. తడి చెత్తను కరెంటు ఉత్పత్తి కోసం,  పొడి చెత్తతో ఎరువు తయారు చేసి రైతులకు వినియోగిస్తామన్నారు. సిరిసిల్లలో పొడి చెత్తతో మెప్మా మహిళలు నెలకు రూ.2.50 లక్షల ఆదాయం పొందుతున్నారు.. చూడటానికి బస్సు తీసుకొని సిరిసిల్లకు రావాలని కోరారు. కేసీఆర్‌కు మొక్కలంటే మహా ఇష్టమని, జనగామ పక్కనే ఉన్న సిద్ధిపేట నియోజకవర్గంలో 1985–86 ప్రాంతంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్‌ ఆ కాలంలోనే హరిత సిద్ధిపేట కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తు చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్‌ కె.నిఖిలతో కలసి జనగామ మున్సి పాలిటీల్లోని 13, 30 వార్డుల్లోని అంబేడ్కర్‌ కాలనీల్లో గడపగడపకు వెళ్లారు. నమస్తే అమ్మా.. నీ పేరేంటి తల్లీ..  పింఛన్‌ వస్తుందా.. అంటూ వృద్ధులను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు