కేటీఆర్‌కు అరుదైన గౌరవం

24 Jan, 2020 01:42 IST|Sakshi
కోకోకోలా సీఈవో జేమ్స్‌క్వెన్సితో మంత్రి కేటీఆర్‌

‘వరల్డ్‌ ఎకనామిక్‌ లీడర్స్‌’ భేటీలో పాల్గొన్న మంత్రి

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి ప్రత్యేక ఆహ్వానం

రాష్ట్ర స్థాయి మంత్రిగా కేటీఆర్‌ ఒక్కరే హాజరు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుకి అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) ప్రత్యేక ఆహ్వానం మేరకు గురువారం జరిగిన ‘వరల్డ్‌ ఎకనామిక్‌ లీడర్స్‌’ సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ‘సాంకేతిక అభివృద్ధి వేగాన్ని కొనసాగించడం–సాంకేతిక ఆధారిత పరిపాలన’ అనే అంశంపై ఈ సమావేశాన్ని నిర్వహించారు. సాధారణంగా ఈ సమావేశా నికి ప్రభుత్వాధినేతలు, కేంద్ర ప్రభుత్వాల విధానరూపకర్తలైన సీనియర్‌ మంత్రులను మాత్రమే ఆహ్వానిస్తారు. ఈ సమావేశానికి హాజరైనవారిలో రాష్ట్ర మంత్రి స్థాయిలో కేటీఆర్‌ ఒక్కరే ఉండటం అరుదైన గౌరవమని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశం కోసం మంత్రి కేటీఆర్‌కి డబ్ల్యూఈఎఫ్‌ ప్రత్యేక బ్యాడ్జ్‌ను అందించినట్టు పేర్కొంది. ప్రపంచ లీడర్లందరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి వివిధ అంశాలపైన మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించేందుకు డబ్ల్యూఈఎఫ్‌ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం డబ్ల్యూఈఎఫ్‌ వివిధ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, సీనియర్‌ కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించింది. సెర్బియా, పోలాండ్‌ తదితర దేశాల ప్రధానులతోపాటు బ్రెజిల్, సింగపూర్, కొరియా, ఇండోనేసియా, బోట్సా్వనా, ఒమన్, ఇథియోపియా దేశాలకు చెందిన పలువురు సీనియర్‌ కేంద్రమంత్రులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

మూడో రోజు దావోస్‌లో కేటీఆర్‌..
దావోస్‌లో వరుసగా మూడో రోజు కేటీఆర్‌ పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల ప్రముఖులతో సమావేశమయ్యారు. సౌదీ కమ్యూనికేషన్స్‌ మంత్రి అబ్దుల్లా ఆల్‌ స్వాహతో సమావేశమై హైదరాబాద్‌ నగరంలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాల పరిశీలనకు రావాలని ఆహ్వానించారు. మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర, డెన్మార్క్‌కు చెందిన మల్టీనేషనల్‌ ఫార్మా కంపెనీ నోవో నోర్‌ డిస్క్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు క్యమీల సిల్వెస్తోతో సమావేశమయ్యారు. రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (రిచ్‌), బయోఆసియాతో భాగస్వామ్యానికి సంబంధించి నోవో నోర్‌ డిస్క్‌ కంపెనీతో చర్చించారు. మైక్రాన్‌ టెక్నాలజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సంజయ్‌ మహోత్ర, కోకోకోలా సీఈవో జేమ్స్‌ క్వెన్సి, ప్రముఖ సామాజిక మాధ్యమం యూట్యూబ్‌ సీఈవో సుసాన్‌ వొజ్విక్కితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ నగరం తమకు ప్రాధాన్యత ప్రాంతమని జేమ్స్‌ క్వెన్సి కేటీఆర్‌కు తెలిపారు.

ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ కంపెనీ సనొఫి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌తో సమావేశమై హైదరాబాద్‌లో ఔషధ రంగ కంపెనీల ఏర్పాటుకు ఉన్న సానుకూల అంశాలతోపాటు డిజిటల్‌ డిస్కవరీ రంగంలో వస్తున్న వినూత్నమైన ట్రెండ్స్, ఫార్మాస్యూటికల్‌ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి అనేక అంశాలపై చర్చించారు. దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌ఎంఈ, స్టార్టప్‌ శాఖల మంత్రి యంగ్‌ సున్, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, పబ్లిక్‌ పాలసీ ఉపాధ్యక్షుడు మైఖేల్‌ పుంకే, సాఫ్ట్‌ బ్యాంక్‌ సీనియర్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ దీప్‌ నిషార్, నెస్లే ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్రిస్‌ జాన్సన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం, యానిమల్‌ హస్బండ్రీ రంగాల్లో చేపట్టిన పలు ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఉన్న అవకాశాలపై క్రిస్‌ జాన్సన్‌తో చర్చించారు.

మరిన్ని వార్తలు