ఓఆర్‌ఆర్‌ గ్రామాల్లో నీటి ఇక్కట్లు రాకుండా చూడాలి

28 Feb, 2020 18:51 IST|Sakshi

ప్రతి నీటి చుక్క అమూల్యమైనదే

వాన నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి

మంత్రి కె.తారక రామరావు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదని, ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు పిలుపునిచ్చారు. వాన నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపట్టాలని, ఇందుకు ప్రజలంతా కలిసి రావాలన్నారు. ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణపై కార్యక్రమాలు చేపట్టాలని, ఈ వేసవి కాలంలో సంరక్షణ కార్యక్రమాలు చేపడితే రానున్న వర్షాకాలంలో సత్ఫలితాలను ఇస్తాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లోని  జలమండలి నిర్మించిన థీమ్ పార్కును సందర్శించిన మంత్రి, అక్కడ జలమండలి చేపట్టిన ప్రాజెక్టులపై, బోర్డు కార్యకాలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జలమండలి రూపొందించిన రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ థీమ్ పార్కు.. విద్యార్థులు, నగరవాసులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అద్భుతమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. (ఫ్యాన్‌ అత్యుత్సాహం: కేటీఆర్‌ ఏమన్నారంటే..)

ఇదే సరైన సమయం
జలమండలి రూపొందించిన దాదాపు 42 నీటి సంరక్షణ నమానాలు, పద్ధతులు విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయన్నారు. నేడు నీటిని సంరక్షిస్తేనే రానున్న  రోజుల్లో భవిష్యత్ తరాలకు నీటి ఇక్కట్లు ఉండవని తెలిపారు. అలాగే ఇప్పడు ఇంకుడుగుంతలు, నీటి సంరక్షణపై పెద్ద ఎత్తున తగిన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్లో వర్షాకాలానికి ముందే చైతన్యం తీసుకువచ్చేందుకు ఇది సరైన సమయం అని కేటీఆర్ తెలిపారు. ఈ విధంగా చర్యలు తీసుకుంటే రానున్న వర్షాకాలంలో సత్ఫలితాలను ఇస్తాయని, భూగర్భ నీటి మట్టాలు పెరుగుతాయని తెలిపారు.
(కేంద్ర ఆర్థిక ముఖ్య సలహాదారుతో కేటీఆర్‌ భేటీ )

జలమండలి తన వంతు పాత్ర పోషిస్తుంది
థీమ్ పార్కులో ఏర్పాటు చేసిన పలు రకాల నమానాలను మంత్రి తిలకించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం హైదరాబాద్ అభివృద్దిలో జలమండలి తన వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసిందని, ఇంకా స్వయం సమృద్ది సాధించడానికి, నగరవాసులకు మెరుగైన సేవల కోసం జలమండలి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు.అలాగే జలమండలి ప్రధాన నగరంలో మంచినీటి సరఫరా చేసిన జలమండలి ఓఆర్ఆర్ గ్రామాల్లో సైతం మంచినీటి సరఫరా చేపడుతుందని తెలిపారు. ఇందుకోసం ఓఆర్ఆర్ ప్రాజెక్టును 193 గ్రామాల్లో పనులు చేపట్టి, మంచినీటి సరఫరా చేపడుతుందని కేటీఆర్‌ వివరించారు. (ఢిల్లీ అల్లర్లు: ఆ తల్లి పిల్లలతో సహా..!)

వేసవికాలంలో ఓఆర్ఆర్ గ్రామాల్లో నీటి ఇక్కట్లు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. అలాగే ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ శివారు మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న సెవరెజీ నిర్వహణను మార్చి 1 నుంచి జలమండలి చేపడుతుందని తెలిపారు. విషయంలో పక్కా ప్రణాళికతో అయా ప్రాంతాల్లోని సెవరెజీ నిర్వహణకు సన్నద్దం కావాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంఏయూడీ ప్రిన్సిపాల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ ఎం. దానకిషోర్, జలమండలి డైరెక్టర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు