నవీన్‌ను ఆదుకుంటాం

10 Apr, 2018 12:44 IST|Sakshi
నవీన్‌ను పరామర్శించి వివరాలు తెలుసుకుంటున్న ఆరోగ్య మిత్ర వెంకన్న

కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్‌ హామీ  

తిరుమలాయపాలెం: దీనావస్థలో ఉన్న మండలంలోని సుబ్లేడు గ్రామానికి చెందిన యువకుడు గండమల్ల నవీన్‌ను ఆదుకుంటామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హామీ ఇచ్చారు. నవీన్‌ దీనస్థితిపై సోమవారం ‘సాక్షి’లో ‘అప్పుడు ఉద్యమం..ఇప్పుడు అచేతనం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో భోజన విరామ సమయంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాత మధుసూదన్, ప్రముఖ న్యాయవాది ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి సహకారంతో నవీన్‌ తల్లిదండ్రులు మంగమ్మ, నర్సయ్యలు మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు.

దీంతో అక్కడే ఉన్న ప్రముఖ వైద్యులతో నవీన్‌కి శస్త్రచికిత్సలపై మంత్రి మాట్లాడారు. శస్త్రచికిత్సలు చేసిన ఫలితం లేదని డాక్టర్లు తెలపడంతో నవీన్‌ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యతలు చూసుకోవాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సూచించారు. రెక్కాడితే డొక్కాడని తమ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని ఎంత బిజీగా ఉన్నా తమతో మాట్లాడి భరోసా ఇవ్వడం పట్ల నవీన్‌ తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆరోగ్యశ్రీ అధికారులు కూడా సుబ్లేడు వెళ్లి నవీన్‌ని కలిసి హాస్పిటల్‌ రికార్డులను పరిశీలించారు.

మరిన్ని వార్తలు