మడికొండలో ఐటీ కంపెనీలను ప్రారంభించిన కేటీఆర్‌

7 Jan, 2020 15:52 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: మడికొండ ఐటీ సెజ్‌లో నిర్మించిన టెక్‌ మహీంద్ర, సైయంట్‌ ఐటీ సెంటర్లను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రారంభం మాత్రమేనన్నారు. తెలంగాణలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తున్నామని తెలిపారు. వరంగల్‌-హైదరాబాద్‌ హైవేను పారిశ్రామిక కారిడార్‌గా మార్చివేస్తామన్నారు. మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పినట్లుగా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి వరంగల్, కరీంనగర్‌తో పాటు నల్గొండ, నిజామాబాద్, ఖమ్మంలో కూడా కంపెనీలను ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అడిగిన వెంటనే తెలంగాణలో కంపెనీలు నెలకొల్పిన టెక్ మహీంద్రా సీఈఓ గుర్నాని, సైయంట్‌ ఎండీ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

‘నీళ్లు, నిధులు, నియామకాలు నినాదమే తెలంగాణ ఆవిర్భావం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమానికి పెట్టాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పటికీ నిరుద్యోగ యువత సంఖ్య ఎక్కువగా ఉంది. 12-13 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌ కోసం శిక్షణ ఇస్తున్నాం. రానున్న రోజుల్లో లైఫ్ సైన్స్ పరిశ్రమలు కూడా వస్తాయి. తెలంగాణలోని గ్రామీణ యువతకు మంచి స్కిల్‌తో విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. పరిశ్రమల్లో సింహభాగం మన తెలంగాణ యువతకే వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని కేటీఆర్‌ తెలిపారు.


మిల్లు స్థానంలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
‘యాదాద్రి, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పరకాల లాంటి చిన్న ప్రాంతాల్లోనూ చేనేత పరిశ్రమలను నిర్మిస్తాం. వరంగల్‌లో అజంజాహి మిల్లు స్థానంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మిస్తున్నాం. మహబూబాబాద్‌లో ఆహార శుద్ధి పరిశ్రమ సెంటర్, ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ హబ్‌ను ప్రారంభిస్తాం. టెక్‌ మహీంద్రా సీఈఓ గుర్నాని సలహా మేరకు మామూనూర్ ఎయిర్‌పోర్టు పునరుద్దరణతో పాటు హెలిపాడ్ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్‌ మహీంద్రా సీపీ గుర్నా, సైయంట్‌ ఎండీ మోహన్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని కంపెనీలు రావాలి
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ కృషితో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఐటి మంత్రి కేటీఆర్ చొరవతో వరంగల్కు టెక్ మహీంద్రా, సైయంట్‌ వంటి రెండు పెద్ద కంపెనీలు రావడం ఆనందంగా ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే మరిన్ని పరిశ్రమలు, కంపెనీలు రావాలని కోరుతున్నామన్నారు.

గ్రామీణ యువత కోసం ప్రణాళికలు రూపొందించాలి
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు పరిశ్రమలు అనగానే ఒక్క హైదరాబాద్ కు మాత్రమే పరిమితమయ్యేవి. ఇప్పుడు కేటీఆర్ చొరవతో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలు రావడం గొప్ప విషయం. ఇవి గ్రామీణ యువతకు ఉపయోగపడేలా కృషి చేయాలి. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్‌లో చదువుకున్న గ్రామీణ యువత సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ యువత కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఐటీ మంత్రి కేటీఆర్‌ను ఈటల కోరారు.

చదవండి: స్టార్టప్‌ల రాష్ట్రంగా తెలంగాణ

మరిన్ని వార్తలు