యువతకు ఉపాధే లక్ష్యం

2 Nov, 2019 02:39 IST|Sakshi
శుక్రవారం యాదాద్రి జిల్లాలోని దండు మల్కాపురం గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, కోమటి రెడ్డి సోదరులు తదితరులు

టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 12 లక్షల ఉద్యోగాలు సృష్టించాం

దండుమల్కాపురం గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, యాదాద్రి: యువతకు ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలో టీఎస్‌ఐఐసీ–టీఐఎఫ్‌–ఎంఎస్‌ఎంఈ–గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ను సహచర మంత్రి జి. జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో కేటీఆర్‌ మాట్లాడారు. రూ.1,552 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో 450 యూనిట్ల స్థాపనకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా 19 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

వాక్‌–టు–వర్క్‌ విధానంలో భాగంగా పార్కులోనే 192 ఎకరాల్లో హౌసింగ్‌ కాలనీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 12 లక్షల ఉద్యోగాలను సృష్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.  తెలంగాణ నాయకులకు పాలన వచ్చా? అని ఎగ తాళి చేసిన వాళ్లే ఇవాళ రాష్ట్ర విధానాలను అనుసరిస్తున్నారని గుర్తుచేశారు. టీఎస్‌ ఐపాస్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఢిల్లీలో జరిగిన పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రుల సమావేశంలో తెలంగాణ పరిశ్రమల విధానాన్ని ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నాయని చెప్పారు. ‘మాది తెలంగాణ’అని గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చామన్నారు.

పక్షం రోజుల్లోనే అనుమతులు...
సింగిల్‌ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని, 15 రోజుల్లో అనుమతులు రాకుంటే డీమ్డ్‌ అఫ్రూవల్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని కేటీఆర్‌ తెలిపారు. పరిశ్రమలకు అనుమతులివ్వడంలో జాప్యం చేసిన అధికారులకు రోజుకు రూ. వెయ్యి జరిమానా విధిస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశంలో అన్ని రంగాలకు 24 గంటల కరెం ట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సూక్ష్మ, స్థూల, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలబడుతోందన్నారు. పెద్ద పరిశ్రమల్లో యాంత్రీ కరణ ఎక్కువగా ఉండి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయని, ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల్లోనే 70 శాతం ఉద్యోగాలు వస్తాయన్నారు.

భవిష్యత్తులో 2 వేల ఎకరాలకు విస్తరణ...
గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ను ప్రస్తుతం 440 ఎకరాల్లో ప్రారంభించినా భవిష్యత్తులో 2 వేల ఎకరాలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. 440 ఎకరాల్లో పార్క్‌ ఏర్పాటు చేసినా మరింత స్థలం కావాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారని, పార్క్‌ విస్తరణకు అవసరమైన భూసేకరణ కోసం వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ను ఆదేశించారు. గ్రీన్‌ ఇండస్ట్రీకి మాత్రమే ఇందులో పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ ప్రారంభించుకున్నామని, పెరిగే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ దగ్గర 132 కేవీ సబ్‌ స్టేషన్‌ ప్రారంభిస్తామన్నారు.

వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌ను, సంగారెడ్డి జిల్లా లో దేశంలోనే అతిపెద్ద మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్లాస్టిక్‌ పార్క్, మైక్రో ప్రాసెసింగ్‌ పార్క్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు. ఏ పరిశ్రమ ఏర్పాటైన మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు ప్రత్యేక కోటా కేటాయిస్తున్నట్లు చెప్పా రు. చౌటుప్పల్‌ ప్రాంతంలో 40 కాలుష్యకారక పరిశ్రమలు పనిచేస్తున్నాయన్నారు. కాలుష్య నివారణకు ఎఫ్లు్యయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు.

మరో 3 చోట్లా ఇండస్ట్రియల్‌ పార్క్‌లు...
నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌లలోనూ ఇండస్ట్రియల్‌ పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నామని కేటీఆర్‌ తెలిపారు. త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు డ్రైపోర్టు రాబోతుందన్నారు. ఖాయిలా పరిశ్రమలను ఆదుకోవడానికి ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ను తీసుకురానున్నట్లు వివరించారు. పార్క్‌కు భూములిచ్చిన వారికి కుటుంబానికో ఉద్యోగమివ్వాలని నిర్ణయించినట్లు  చెప్పారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 10 ఎకరాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక యువతకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. రాష్ట్రానికి అన్నీ చిన్న పరిశ్రమలే వస్తున్నాయని, భారీ పరిశ్రమలను తీసుకురావాల్సిన అవ సరం ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి స్థానిక శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధ్యక్షత వహించారు.

స్థానిక యువతకు ప్రాధాన్యత: మంత్రి జగదీశ్‌రెడ్డి
మల్కాపురం గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ దేశానికే ఆదర్శంగా ఉంటుందని, ఇందులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యతిస్తా మని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్‌ తన ప్రతిభతో రాష్ట్రాన్ని పరిశ్రమలు, ఐటీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చివేశారన్నారు.

మరిన్ని వార్తలు