హైటెక్‌ సిటీలో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ ప్రారంభం

4 Nov, 2019 12:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. బయోడైవర్సిటీ డబుల్‌ హైట్‌ ఫ్లైఓవర్‌ను  సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతో రాయదుర్గం నుంచి హైటెక్‌సిటీ, ఇనార్బిట్‌ మాల్‌ వైపు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా ప్రయాణం చేయవచ్చు. రెండున్నర ఏళ్లకు ముందు ప్రారంభమైన నిర్మాణానికి స్థల సేకరణ అడ్డంకిగా మారడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తి కావడంతో అతి ఎత్తయిన వంతెన అందుబాటులోకి వచ్చింది.

బల్దియా పరిధిలో ఎస్‌ఆర్‌డీపీ పనుల కింద చేపట్టిన ఫ్లైఓవర్లలో ఈ డబుల్‌ ఫ్లైఓవర్‌ నగరంలోనే ఎత్తయినది. దాదాపు రూ.16.47 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ వంతెన జంక్షన్‌లో ఎత్తు 17.45 మీ. కాగా, పొడవు 990 మీ, వెడల్పు 11.5 మీటర్లు. మూడు లైన్ల వెడల్పులో వన్‌ వేలో వెళ్లాల్సి ఉంటుంది.  ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పాల్గొన్నారు.

మరోవైపు  గచ్చిబౌలి వద్ద రెండు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రెండు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ను రూ. 330 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. 

  • ఎస్‌ఆర్డీపీలో భాగం గా 69.47  కోట్ల రూపాయల వ్యయంతో 900 మీటర్ల పొడవున మూడు లేన్లుగా జీహెచ్‌ఎంసీ నిర్మించిన బయోడైవర్సిటీ  ఫ్లై ఓవర్ 
  • నగరంలో ఇప్పటికే 3 ఫ్లై ఓవర్లు , 4 అండర్ పాసులు  అందుబాటులోకి రావడంతో ఆ రూట్‌లో తగ్గిన ట్రాఫిక్ కష్టాలు
  • బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌తో మోహిదీపపట్నం, ఖాజాగూడ నుంచి మైండ్‌ స్పేస్‌ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా సిగ్నల్‌ ఫ్రీగా వెళ్ళవచ్చు
  • ఈ ఫ్లైఓవర్‌ మెహిదీపట్నం నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లే వారికి ఎంతో సమయం కలిసిరావడంతో పాటు.. ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పుతాయి
  • హైటెక్‌ సిటీ వైపు వెళ్లేవారు కూడా జంక్షన్‌ దగ్గర ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు.
  • బయో డైవర్సిటీ, మంత్రి కేటీఆర్‌, ఫ్లై ఓవర్‌, రాయదుర్గం, ట్రాఫిక్‌ ఫ్రీ
మరిన్ని వార్తలు