బ్రాండ్‌ సిరిసిల్ల కావాలి 

12 May, 2020 03:20 IST|Sakshi
సిరిసిల్లలో బతుకమ్మచీరను పరిశీలిస్తున్న కేటీఆర్‌. చిత్రంలో జౌళి శాఖ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌ తదితరులు

నైపుణ్యం, నవ్యతతో వస్త్రాలు ఉత్పత్తి చేయండి

జాతీయ గుర్తింపునకు అన్ని చర్యలు తీసుకుంటాం

నేత కార్మికులకు మంత్రి కేటీఆర్‌ భరోసా

సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్కులో పలు ప్రారంభోత్సవాలు 

సిరిసిల్ల/తంగళ్లపల్లి: దేశంలోనే సిరిసిల్ల వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా నాణ్యత, నవ్యతతో వస్త్రాలను ఉత్పత్తి చేయాలని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్‌టైల్‌ పార్కులో రూ.14.50 కోట్ల వ్యయంతో చేపట్టిన సెంట్రల్‌ లైటింగ్, శిక్షణ కేంద్రం, పరిపాలనా భవనం, క్యాంటీన్‌ భవనాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. సిరిసిల్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నడూలేని విధంగా సిరిసిల్ల నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ కానుకగా ఆడపడచులకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

సిరిసిల్ల బ్రాండ్‌ ఇమేజ్‌ ఉండేలా ఆధునికతను సంతరించుకునేలా వస్త్రాలు తయారు చేయాలని మంత్రి కోరారు. నేత కార్మికులు ఆత్మగౌరవంతో జీవించే విధంగా వేతనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తోందన్నారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కును వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల మహిళలకు ఉపాధి కల్పించేందుకు రెడీమేడ్‌ వస్త్రాల తయారీ కేంద్రాన్ని (అపెరల్‌ పార్కు) ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత నేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని, ఈ విషయాన్ని ఏ నేత కార్మికుడిని అడిగినా చెబుతాడని కేటీఆర్‌ పేర్కొన్నారు. పవర్‌లూమ్‌ పరిశ్రమకు 50 శాతం విద్యుత్‌ సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు, జౌళి రంగానికి చేయూత అందించాలని కేంద్ర మంత్రికి లేఖ రాశామన్నారు. కార్యక్రమంలో జౌళి శాఖ డైరెక్టర్‌ శైలజారామయ్యర్, కలెక్టర్‌ డి.కృష్ణభాస్కర్‌ పాల్గొన్నారు.

మంత్రి పర్యటనలో పలువురి నిరసన  
కేటీఆర్‌ ప్రసంగిస్తున్న సమయంలో వెంకటేశ్‌ టెక్స్‌టైల్స్‌ యజమాని దొంతుల నరహరి వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశాడు. తమ సమస్యలను విన్నవించేందుకు వచ్చిన ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లను, పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు మంత్రి తంగళ్లపల్లిలో కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి మీడియాను అనుమతించక పోవడంతో పలువురు జర్నలిస్టులు నిరసన తెలిపారు.

మరిన్ని వార్తలు