సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం

27 Nov, 2019 02:45 IST|Sakshi
మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్, స్మృతీ ఇరానీలకు జ్ఞాపికలను అందజేస్తున్న మంత్రి కేటీఆర్‌

ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సదస్సులో కేటీఆర్‌

రాష్ట్రంలోని పథకాల గురించి వివరించిన మంత్రి

టీఆర్‌ఎస్‌ ఎంపీలతో భేటీ

రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు దిశానిర్దేశం

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఐటీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన క్రిసిల్‌ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కాన్‌క్లేవ్‌–2019 సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పౌరులకు మౌలికసదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఆయన వివరించారు. ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు ఇన్నొవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూషన్‌ (3–ఐ) విధానం అవలంబిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 1.05 లక్షల కి.మీ పైప్‌లైన్‌ నిర్మాణంతో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీటి సరఫరాకు రూ.45 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 68 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు 26 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని, అందులో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరం అని వివరించారు. గత ఐదేళ్లలో 7 వేల కి.మీ రవాణా వ్యవస్థను మెరుగుపరిచామని, 2.83 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, ఇందులో 1.67 లక్షలు పట్టణ ప్రాంతాల్లో నిర్మించామని తెలిపారు. 10 లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా టీఎస్‌ ఐపాస్‌ ప్రవేశపెట్టామని వివరించారు.

మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు సాయం చేయండి.. 
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ జిల్లాలో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు గ్రాంట్‌ సహకారం అందించాల్సిందిగా కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీని మంత్రి కేటీఆర్‌ కోరారు. మంగళవారం ఆమె కార్యాలయంలో కేటీఆర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే 14 పెద్ద సంస్థలతో రూ.3,020 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు. కామన్‌ ఎఫ్లుయెంట్‌ ప్లాంట్‌(సీఈటీపీ) ఏర్పాటు ప్రతిపాదనలకు సంబంధించి రూ.897 కోట్ల నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. అలాగే సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ను మంజూరు చేసి దానికి అవసరమైన రూ. 49.84 కోట్లు విడుదల చేయాలని కోరారు.

ఫార్మాసిటీకి సహకరించండి
హైదరాబాద్‌ ఫార్మా సిటీకి అవసరమైన సహకారం అందించాల్సిందిగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను మంత్రి కేటీఆర్‌ కోరారు. కేంద్ర మంత్రిని కలసిన కేటీఆర్‌.. ఫార్మా సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి రావాల్సిన అనుమతిలిచ్చి సహకరించాలని కోరారు. కాగా, టీఆర్‌ఎస్‌ ఎంపీలను పార్లమెంట్‌లోని పార్టీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. కేంద్రం నుంచి వివిధ పథకాల కింద రాష్ట్రానికి నిధులు సాధించడంపై చర్చించారు.

మరిన్ని వార్తలు